ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగంగానే కోడి పందాలు
ఆంధ్రాకు తెలంగాణ పంటర్ల పరుగో పరుగు
ప్రజాపక్షం/ హైదరాబాద్: సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పిల్లా పాపలతో సొంతూర్లకు హైదరాబాద్ నుంచి పయనమవుతున్న కుటుంబాలు సర్వసాధరణమే. మరోపక్క కోడి పందాలు ఆడేందు కు పంటర్లు కూడా రెడీ అవుతున్నారు. కోడి పందాలపై సుప్రీంకోర్టు ఆంక్షలున్నా ఆం ధ్రప్రదేశ్‌లో బహిరంగంగానే జరుగుతాయి. ఈ పందాలలో ప్రజా ప్రతినిధులతో పాటు పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే తెలంగాణకు చెందిన పంటర్లు ఆంధ్రప్రదేశ్‌కు పరుగు పెట్టారు. అక్కడ కోడి పందాలు ఆడితే ఎలాంటి కేసులు ఉండవని వారి ధీమా. ఒకపక్క వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో పంటర్లలో ఫుల్ జోష్ వచ్చింది. వీరంతా తమ తమ సొంత కార్లలో ఎపిలోని విజయవాడ, అమలాపురం, చిలకలూరిపేట, గుంటూరు, కాకినాడ, గుడివాడ, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాకు బయల్దేరారు. మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను వారు కోడి పందాల వద్దనే గడపనున్నారు. తమ వద్దకు వచ్చే పంటర్ల కోసం కోడి పందాల నిర్వాహకులు ప్రత్యేకంగా హోటళ్లు, లాడ్జీలు ఇప్పటికే బుక్ చేశారు. పంటర్లకు కావాల్సిన వసతి, భోజన సదుపాయాలను కల్పించారు. ఇక వ్యవసాయ క్షేత్రాలలో జరిగే కోడి పందాల వద్ద ప్రత్యేకంగా టెంట్‌లు వేసి అక్కడే వారికి బస కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పేకాట క్లబ్‌లను నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వం మూసి వేయించింది. అయితే పంటర్లు మాత్రం దొంగచాటుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రలో విచ్ఛలవిడిగా కోడి పందాలు జోరుగా సాగుతాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న పంటర్లు ఆంధ్రకు వెళ్తున్నారు. కోడి పందాలలో వీరు లక్షల రూపాయలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. గత ఏడాది కూడా ఇక్కడి పంటర్లు ఆంధ్రలో జరిగే కోడి పందాల పోటీలలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.