పోరుకు సిద్ధమైన పురపాలికలు
ప్రచారానికి మిగిలింది ఆరు రోజులే
మున్సిపోల్స్‌లో తేలిన అభ్యర్థులు
పలు చోట్ల స్వతంత్రులుగా టిఆర్‌ఎస్ రెబెల్స్
బి ఫారం దక్కని ఆశావహుల ఆత్మహత్యాయత్నాలు
ప్రజాపక్షం/హైదరాబాద్; మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు ఆరో రోజుల సమయమే మిగిలింది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగియడంతో బరిలో ఎవరెవరున్నారో, ప్రత్యర్థులెవరో తేలిపోయింది. పలు చోట్ల బి ఫారాలు దక్కని టిఆర్‌ఎస్, ఇతర పార్టీల ఆశావహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జనగామ, సూర్యాపేట, కరీంనగర్ తదితర చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలాచోట్ల బి ఫారం ఎవరికి దక్కుతుందనే అంశంపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. దీంతో బి ఫారం దక్కని పలువురు టిఆర్‌ఎస్ ఆశావహులు ఇండిపెండెంట్‌లుగా బరిలో నిలిచారు. అటు గుర్తులు దక్కిన వెంటనే అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు వరకే ప్రచారానికి అనుమతి ఉంది. దీని ప్రకారం ఈనెల 20వ తేదీ సాయంత్రం వరకే అధికారికంగా ప్రచారానికి అవకాశం ఉంటుంది. అంటే అభ్యర్థులకు ప్రచారానికి ఆరు రోజులే మిగలడంతో మంగళవారం నుండే ప్రచారజోరును పెంచారు. సంక్రాంతి పండుగను కూడా తమ ప్రచారానికి అనుకూలంగా వాడుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి ముగ్గుల కార్యక్రమాలు, పతంగి పోటీల ద్వారా ఓటర్లకు గాలం వేసేందుకు టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నూతన మున్సిపల్ చట్టం అంశాలను టిఆర్‌ఎస్ తన ప్రచార అస్త్రాలుగా ఎంచుకోనుంది. ప్రతిపక్ష పార్టీలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపనున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్, నిరుద్యోగ భృతి, మున్సిపాలిటీ శివారు వార్డులలో రైతు బంధు, రుణమాఫీ అంశాలను, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నాయి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ హామీని కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, సిఎఎ అంశాన్ని బిజెపి ప్రచారంలో అంశంగా చేసుకుంటోంది. ప్రధానంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ఒక ప్రశ్నించే గొంతును మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపించాలని, తమకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను కోరతున్నాయి.