ఒకరు మృతి : నలుగురికి గాయాలు
లూధియానా : పంజాబ్ రాష్ట్రం లూధియానా కోర్టు భవనంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. అయితే పోలీసులు ఆ తర్వాత పరిస్థితిని పూర్తిగా విశ్లేషించి వైద్యుల సమాచారం మేరకు ఈ పేలుడులో ఒక్కరే మరణించారని ప్రకటించారు. మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఈ ఘటనతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ భద్రతా గార్డులు రంగంలోకి దిగారు. జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఎ) కూడా అప్రమత్తమై ఇక్కడ రంగంలోకి దిగుతోంది. పంజాబ్‌లో ఇటీవలికాలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని రాష్ట్ర వ్యతిరేక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించారు. లూధియానా జిల్లా కోర్టులోపల ఈ బాంబు పేలుడు సంభవించింది. కోర్టు అధికారులు, పోలీసుల సమాచారం ప్రకారం, కోర్టు భవనంలోని రెండో అంతస్తులో ఉన్న వాష్ రూమ్‌లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని భవంతులలో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. పేలుడు సంభవించిన సమయంలో కింది అంతస్తులో జిల్లా కోర్టులో విచారణా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పేలుడు ధాటికి కోర్టు భవనం గోడలు బీటలు వారాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్‌లో ఉన్న వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండో అంతస్తులో జరిగిన పేలుడుధాటికి దెబ్బతిన్న బిల్డింగ్ మెటీరియల్ పార్కింగ్‌లోని వాహనాహపై పడింది. లోపల పార్కింగ్‌లో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫోరెన్సిక్ బృందం కోర్టు భవనంలోకి ప్రవేశించి ఆధారాలు సేకరిస్తాయని, అందుకు వీలుగా కోర్టు భవనంలో ఆ ప్రాంతాన్ని సీజ్ చేశామని లూధియానా పోలీసు కమిషనర్ గురుప్రీత్ సింగ్ బుల్లార్ విలేకరులకు చెప్పారు. ప్రాధమిక దర్యాప్తునకు అనుగుణంగా, ఏమీ చెప్పడం కష్టమని ఆయన అంటూ ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, కొన్ని బృందాలు రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి చన్నీ,
కేజ్రీవాల్ సహా పలువురు ఖండన
ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ‘ఆప్’ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా లూధియానా కోర్టులో పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు. పంజాబ్‌లో శాంతి భద్రతలకు తరచు విఘాతం కలుగుతోందని ముఖ్యమంత్రి చన్నీ ఆందోళన వ్యక్తం చేశారు. తానుస్వయంగా లూధియానాలో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటానని విలేకరులతో మాట్లాడుతూ చన్నీ ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఇటీవల పంజాబ్ సర్ణదేవాలయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించగా భక్తులు ఆవేశంతో అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన జరిగిన 12 గంటలలోనే మరో గ్రామంలో ఒక వలస కూలీని స్థానిక ప్రజలు ఇదే కారణంతో కొట్టి చంపారు. దీంతో పంజాబ్‌లో మెజారిటీ మతస్తులు తీవ్ర ఆందోళనకు, మిగిలినవారు అభద్రతకు గురవుతూ ఉండటంతో శాంతి భద్రతల పరిస్థితిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పోలీసును ఆదేశించారు. ఈ ఘటనల్లో నేరస్తులను వదిలేది లేదని ఆయన అన్నారు. కాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేస్తూ ఈ ఘటనపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలిశాక తానెంతో ఆవేదనకు గురయ్యానని, ఈ కేసులో నిందితులను వదిలిపెట్టకూడదని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఈ ఘటనపై సత్వరం విచారణ జరపాలని ఆయన పోలీసు ఉన్నతాధికారును డిమాండ్ చేశారు. ఈ పేలుడు ఘటనపట్ల శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పంజాబ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొని శక్తులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
పంజాబ్ కోర్టు భవనంలో పేలుడు
RELATED ARTICLES