సిఎం ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియలో పెరిగిన వేగం
కమిషనరేట్‌కు చేరిన 8 జిల్లాల రిజర్వేషన్ల జాబితా
నేడు సిఎస్ చెంతకు మొత్తం రిజర్వేషన్ల జాబితా
నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం
ప్రజాపక్షం / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల పర్వంలో వేగం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో ఎన్నికలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అధికారులు ఏర్పాట్లు చేయడంలో వేగం పెంచారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్నికల విధులు నిర్వహించే వారికి ఆదివారం కూడా సెలవును రద్దు చేసి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేయించారు. జిల్లాల్లో కూడా జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం సాయంత్రం నాటికి అన్ని జిల్లాల రిజర్వేషన్లను ఖరారు చేసి పూర్తి జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషికి అందించాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగా పంచాయతీరాజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో గంటగంటకు ఎన్నికల సంఘం అధికారులు పంచాయతీరాజ్ శాఖాధికారులతో టచ్‌లో ఉన్నారు. త్వరగా చేసి పంపించాలంటూ పదేపదే సందేశాలు పంపుతూ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో ఆదివారం సాయంత్రం వరకు ఎనిమిది జిల్లాలకు సంబంధించిన పూర్తి జాబితా పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు చేరుకోగా, రాత్రి 9 గంటలలోపు మరో రెండు లేదా అంత కంటే ఎక్కువ జిల్లాల జాబితాలు అందుతాయని పంచాయతీరాజ్ అధికారి తెలిపారు. మేడ్చల్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్ జిల్లాలకు సంబంధించిన పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాలు కమిషనరేట్‌కు చేరుకున్నాయి.