ఆరేళ్లు పోటీకి అనర్హత
క్రిమినల్ కేసులు
ఎన్నికల సంఘం ఆదేశాలు
వేలం పాటలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు
పరిశీలకుని అనుమతి తర్వాతే ఏకగ్రీవాల ప్రకటన
ప్రజాపక్షం / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు వేలం వేస్తే వారిపై కఠిన చర్య లు తీసుకోనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల పోలీస్, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేసి ఎన్నుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. దీంతో ఎన్నికల నియమావలి, చట్టం ప్రకారం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ అన్ని జిల్లాల, పంచాయతీల ఎన్నికల, పోలీస్ అధికారులకు నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం వేలం పాట ద్వారా పదవికి ఎంపికైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేస్తారు. ఇండియన్ పీనల్ కోడ్, 1860 సెక్షన్లు 171 171 ఇ ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా,ఎన్నికల్లో పోటీ చేయకుం డా ఆరేళ్లపాటు అనర్హత వేటు వేస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ ప్రజల నిర్ణయంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల విధానానికి వేలం పద్ధతి విఘాతం కలిగిస్తున్నందున వీటిని నిరోధించేందుకు ఎన్నికల సంఘం అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ ఫిర్యాదులను స్వీకరించాలి. వాటిని ప్రింట్, ఎలక్ట్రానికి మీడియాలో ప్రచురింపచేసి తప్పు చేసిన వారి వివరాలు, వారిపై వచ్చిన ఆరోపణలు అందరికి తెలిసేలా చేయాలి. వేలం పద్ధతి ద్వారా ఎంపికైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై, ఆయన పదవిపై వెంటనే విచారణ చేపట్టాలి.