27న రాస్తారోకోలు, 28న గవర్నర్, సిఎస్‌లకు వినతిపత్రం, 29న కలెక్టరేట్ల ముట్టడి
ప్రభుత్వం స్పందించకుంటే 30న భవిష్యత్ కార్యాచరణ
అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల పరిరక్షణకై బిసి సంఘాల నేతృత్వంలో అఖిలపక్షం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మూడు రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర వ్యా ప్తంగా విద్యార్థులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, 28న అఖిలపక్ష పార్టీ నాయకుల ప్రతినిధి బృం దం గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కలిసి వినతిపత్రం సమర్పించడం, 29న రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలకు అఖిలపక్షం పిలుపు నిచ్చింది. ప్రస్తుత పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బుధవారం గోల్కొండ హోటల్‌లో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, బిసి సంఘాలు, సామాజిక ఉద్యమ సంస్థలు, న్యాయ నిపుణుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. బిసి సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ వి. ఈశ్వరయ్యగౌడ్, కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, బాలమల్లేశ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ , బిసి సంఘాల నాయకు లు, విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘా ల నాయకులు పాల్గొన్నారు.
సిఎంపై టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు వత్తిడి తేవాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ముఖ్యమంత్రికి 25 వరకుసమయం ఇచ్చామని, అయినా స్పందన లేదన్నారు. రిజర్వేషన్లను పరిరక్షించుకునేందుకు ప్రజాపోరాటం చేస్తూ న్యాయపోరాటం కూడా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం 22 శాతానికి రిజర్వేషన్లు తగ్గించినా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు పోను బిసిలకు వాస్తవానికి 18 శాతం మాత్రమే మిగులుతాయని అన్నారు. ప్రభుత్వం బిసిలకు మైనారిటీలకు కూడా మోసం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్లు తగ్గిస్తే బిసిలకు రాజకీయ అస్థిత్వం ఉండదన్నారు. టిఆర్‌ఎస్‌లోని బిసి ఎంఎల్‌ఎలు, ఎంపిలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో చౌరస్తాలో నిలదీస్తామని, హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయడమే కాకుండా అవసరమైతే రాష్ట్ర బంద్ నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించక పోతే 30న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ మూడు నెలల్లో బిసిల జనగణన తీసి పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తే.. బిసి జనగణన ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. బిసిలను అణగదొక్కడానికే ఆర్డినెన్స్ తెచ్చారని, ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలన్నారు.