మల్టీపర్పస్ వర్కర్స్ మాటే మరిచిన సర్కార్
నిధులే లేవు… నియామకాలు జరిపేదెలా..?
ఇప్పటికీ సిద్ధం కాని మార్గదర్శకాలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, దేశం బాగుండాలంటే అది పల్లె నుంచే మొదలు కావాలి, అందుకే గ్రామ స్వరాజ్యానికి పెద్దపీఠ వేశాం, ప్రతి తం డాను కూడా పంచాయతీ చేశాం, వారి పాలన వారి చేతుల్లోనే పెట్టాం, పల్లె ప్రతిధులకు విశేషాధికారాలు ఇచ్చాం. వారి గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు చేసుకునే అధికారం వారి చేతుల్లోనే పెట్టాం, ప్రతి పంచాయతీ, ప్రతి ఆవాసం పచ్చధనం, పారిశుద్ధ్యంతో తలతల మెరవాల్సిందే, అందుకే ప్రతి పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు తప్పనిసరి చేశాం. ఏ వీధి చూసినా… పరిశుభ్రత తో పరిఢవిల్లాల్సిందే… దీనికోసం ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి 500 జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌ను నియమిస్తు న్నాం. ఒక్కొక్కరికి నెలకు రూ.8,500 వేతనం ఇస్తాం, వీరి నియామకాలకు సంబంధించి విధివిధానాలు ఒకటి రెండు రోజుల్లో సిద్ధం అవుతాయి, కొత్త పాలక వర్గాలు కొలువుదీరకముందే వీరు పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఇతర పంచాయతీ పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటారు… ఇవీ పంచాయతీ ఎన్నికలకు ముందే అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్న మాటలు. అంతే కాదండోయ్… పల్లెపాలనను పరుగులు పెట్టించేందుకు సర్పంచ్‌లు కొలువుదీరకముందే ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని కూడా చెప్పారు. చెప్పినట్టుగానే 9355 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్షలు నిర్వహించారు, ఫలితాలు వెల్లడించారు, దీనిలో లెక్కకు మించిన తప్పులు చేసి ఎక్కడి నియామకాలు అక్కడే నిలిపివేశారు. పంచాయతీ పోరు ముగిసింది, పాలకవర్గాలు కొలువుదీరాయి, చివరకు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించి పాత పాలకుడే మళ్లీ అధికారంలోకి వచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా గ్రామసీమలే దేశానికి దివిటీలని పాత పాటే పాడారు. అయినా పల్లెల్లో పరిస్థితి ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వచ్చారే కాని పంచాయతీలో పనిచేసేందుకు సిబ్బంది లేరు, పాలనా వ్యవహారాలు చూసుకునేందుకు గ్రామ కార్యదర్శులు లేరు, కూలీ ఇచ్చి కనీసం పల్లెల్లో వీధులనైనా శుభ్రం చేయించాలంటే ఏ ఒక్క పంచాయతీలోనూ చిల్లి గవ్వలేదు, కాస్తా సిరిమంతులైన సర్పంచ్‌లు వారి పరువు నిలబెట్టుకోవడానికి సొంత పైసలతో అత్యవసరమైన వీధులను ఊడ్పించి, చెత్త తొలగించే పనులు చేయిస్తున్నారు తప్ప మిగిలిన పంచాయతీల పరిస్థితి అంతా దయనీయంగా మారింది. గ్రామ కార్యదర్శుల నియామకాల పర్వం కోర్టులో ఉంది కాబట్టి ఈ విషయంలో సర్కారును అంతగా నిందించకున్నా… గ్రామాలు శుభ్రంగా ఉంటేనే కదా ఏ రోగాల బారిన పడకుండా గ్రామీణం ఉండేది. పైగా ఇది అత్యవసరం. ఇలాంటి విషయంలో సర్కారులో ఏ మాత్రం చలనం లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో అన్ని చిన్నవిగా మారాయి. ఆస్థిపన్నే పంచాయతీలకు ప్రధాన ఆదాయవనరు. ఇప్పుడు చిన్నవిగా మారడంతో కొన్ని పంచాయతీల్లో గుడిసెలు తప్ప రేకుల ఇళ్లు కూడా కనిపించని పరిస్థితి. ఇలాంటి చోట ఇక ఆస్థిపన్ను వచ్చేదెలా… దీంతో పల్లెలన్నీ చెత్తచెదారంతో నిండి కంపుకొట్టే దుస్థితికి చేరుకున్నాయి. పంచాయతీల పరిస్థితి చూస్తే.. కొత్తగా పంచాయతీలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 500 జనాభా లోపు ఉన్న పంచాయతీలు 896 ఉన్నాయి. ఇక్కడ ఆస్థిపన్ను కాదు కదా.. ఏపన్ను కూడా విధించలేని పరిస్థితి. వీటికి గ్రామ కార్యదర్శిని, మల్టీపర్పస్ వర్కర్స్‌ను నియమించినా పైసా ఆదాయం లేనప్పుడు వారి జీతాలే భారంగా మారుతాయి. 500 నుంచి 1000జనాభా వరకు ఉన్న పంచాయతీలు4138, 1000 నుంచి 1500వరకు జనాభా ఉన్నవి 2799, 1500 నుంచి 2000 వరకు జనాభా ఉన్నవి 1786, 2000నుంచి 2500 వరకు జనాభా ఉన్నవి 1137, 2500 నుంచి 3000 జనాభా ఉన్నవి 656, 3000 నుంచి 3500 జనాభా ఉన్నవి 456, 3500 నుంచి 4000 జనాభా ఉన్నవి 259, 4000 నుంచి 4500 జనాభా ఉన్న పంచాయతీలు 182 ఉన్నాయి. మొత్తం 12751 పంచాయతీల్లో ఇవి పోగా మిగిలిన వాటిలో 4500 జనాభా కంటే ఎక్కువ ఉన్నారు.