535 ఠాణాలు.. 12,732 పంచాయతీలకు ఎన్నికలు
సిబ్బంది లేక తలలు పట్టుకుంటున్న పోలీసులు
అదనపు పోలీసు బందోబస్తు కావాల్సిందేనంటున్న ఎస్‌హెచ్‌ఒలు
ప్రజాపక్షం/ హైదరాబాద్: రెండు నెలల పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో బిజీబిజీ గా విధులు నిర్వహించి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటు న్న పోలీసులకు రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్డ్ వెలువడడంతో గుదిబండగా మారింది. 30 జిల్లాలలో 12732 గ్రామ పంచాయతీలకు ఈ నెల 20, 25, 30 తేదీల్లో మూడు దశల్లో ఎన్నిక లు జరుగుతాయి. ఈ నెల 7 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు 30వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ సాగనుంది. దీంతో పోలీసులు బందోబస్తుకు తిరిగి సిద్ధమవుతున్నారు. బందోబస్తుకు సరిపోను సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతాయని అధికారులు భయపడుతున్నారు. సుమా రు 535 పోలీసు స్టేషన్ల పరిధిలో మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. సగటున ఒక్కో పోలీసు స్టే షన్ పరిధిలో 23 పంచాయతీలు ఉన్నాయి. అయితే పోలీసు స్టేషన్‌లో సిబ్బంది సంఖ్య తక్కువ ఉండడం, పంచాయతీలు ఎక్కువగా ఉండడంతో అదనపు పోలీసు బందోబస్తు కావాల్సిందేనని ఎస్‌హెచ్‌ఒలు తలలు పట్టుకుంటున్నా రు. కొన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బంది సంఖ్య 15 ఉంటే పంచాయతీలు మాత్రం 54 వరకు ఉన్నాయి. ఈ లెక్కన నాలుగు పంచాయతీలకు ఒక్క పోలీసు చొప్పున బందోబస్తు నిర్వహించాలి. ఏదైనా ఒక గ్రామంలో అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగితే నివారించడం చాలా కష్టం. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికలకు బందోబస్తు నిర్వహించాలంటే అధికంగా పోలీసు సిబ్బంది ఉండాల్సిందే. అదీ కూడా ప్రతి గ్రామంలో 24 గంటలు నిఘా పెట్టాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతి రోజు ఒక్కో ఠాణా పరిధిలో నాలుగు లేదా ఐదు గ్రామాలలో మాత్రమే రాజకీయ నేతల ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకు ఆయా ఠాణాలో ఉన్న సిబ్బంది బందోబస్తుకు సరిపోయే వారు. అయితే పంచాయతీ ఎన్నికలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒక ఠాణా పరిధిలో ప్రతి రోజు ఎన్నికల ప్రచారం 40 నుంచి 50 గ్రామాలలో ఉంటా యి. ఒకే రోజు ఇన్ని పంచాయతీలకు బందోబస్తు నిర్వహించాలంటే కత్తిమీద సామే. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఘర్షణలు కూడా చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిధి చిన్నదే అయినా ఎన్నికలను మాత్రం అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. తగిన పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఘర్షణలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక ఈ సందర్భంలోనే పాత కక్షలు కూడా భగ్గుమనే అవకాశాలు ఉన్నాయి. సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మక పంచాయతీ గ్రామాలు అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువగానే ఉన్నాయి.