HomeNewsBreaking Newsన్యూజిలాండ్‌పై భారత్‌ విజయం

న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం

హైదరాబాద్‌: మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఉప్పల్‌ మైదానం వేదికగా బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. లోకల్‌ భాయ్‌ మహమ్మద్‌ సిరాజ్‌(4/46) అసాధారణ ప్రదర్శనతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. మిచెల్‌ సాంట్నర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 162 పరుగులు జోడించాడు. ఈ బిగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ను సిరాజ్‌ విడదీయడం.. చివర్లో హార్దిక్‌ పాండ్యా పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) ఒక్కడే డబుల్‌ సెంచరీ బాదగా.. రోహిత్‌ శర్మ(34), సూర్యకుమార్‌ యాదవ్‌(31) రాణించారు. బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్‌ మిచెల్‌ రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్‌, బ్లెయిర్‌ టిక్క్‌నర్‌, మిచెల్‌ సాంట్నర్‌ తలో వికెట్‌ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్‌ 337 పరుగులకు కుప్పకూలింది. బ్రేస్‌ వెల్‌కు తోడుగా మిచెల్‌ సాంట్నర్‌(57) రాణించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్‌ పాండ్యాకు తలో వికెట్‌ దక్కింది. పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(10)ను మహమ్మద్‌ సిరాజ్‌ షాట్‌ పిచ్‌ బాల్‌తో పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. ప్లే అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌.. ఫిన్‌ అలెన్‌(40)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ఆ వెంటనే హెన్రీ నికోల్స్‌(18)ను కుల్దీప్‌ యాదవ్‌ స్టన్నింగ్‌ డెలివరీతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. తన మరుసటి ఓవర్‌లో డారిల్‌ మిచెల్‌(9) వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.క్రీజులోకి వచ్చిన గ్లేన్‌ ఫిలిప్స్‌ను మహమ్మద్‌ షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌(24)ను సిరాజ్‌ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దాంతో న్యూజిలాండ్‌ 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన మైకేల్‌ బ్రేస్‌ వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. బ్రేస్‌ వెల్‌ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగగా.. సాంట్నర్‌ యాంకర్‌ రోల్‌ పోషించాడు. ఠాకూర్‌ వేసిన 37వ ఓవర్‌లో 4,6, 4తో 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరింత ధాటిగా ఆడిన బ్రేస్‌ వెల్‌.. శార్దూల్‌ ఠాకూర్‌నే టార్గెట్‌ చేశాడు. ఓవర్‌కు ఓ సిక్స్‌ బాదుతూ జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు. షమీ వేసిన 43వ ఓవర్‌లో సిక్స్‌ బాది 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నుంచి సెంచరీ అందుకున్నాడు. ఆ వెంటనే మిచెల్‌ సాంట్నర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బ్రేస్‌వెల్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 46వ ఓవర్‌లో వరుస బంతుల్లో సాంట్నర్‌తో పాటు షిప్లేను ఔట్‌ చేసి భారత విజయవకాశాలను మెరుగుపరిచాడు. సాంట్నర్‌ వికెట్‌తో ఏడో వికెట్‌కు నమోదైన 162 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. సాంట్నర్‌ ఔటైనా.. బ్రేస్వేల్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 48వ ఓవర్‌లో షమీ 17 పరుగులు ఇవ్వడంతో న్యూజిలాండ్‌ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమయ్యాయి. 49వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా.. ఫెర్గూసన్‌ ఔట్‌ చేయగా.. ఈ ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌ తొలి బంతిని బ్రేస్‌ వెల్‌ సిక్సర్‌ బాదడంతో ఉత్కంఠగా మారింది. అయితే రెండో బంతికి బ్రేస్‌ వెల్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments