దోమ్‌డోమా : అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అది బిజెపి రాజకీయ కార్యక్రమమని పేర్కొన్నారు. మంగళవారం రాహుల్‌గాంధీ అసోంలోని దోమ్‌డోమాలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిఎం బిశ్వ శర్మ అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. అయినా సిఎం చేసే ప్రతి చర్య చల్ల యాత్రకు ప్రయోజనం చేకూరుతుందని, మరింత ఆదరణ పొందుతుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తమ యాత్ర ఒక అంశంగా మారిందన్నారు. దేశంలోని అత్యధిక అవినీతి ముఖ్యమంత్రుల్లో హిమంత్ బిశ్వశర్మ ఒకరన్నారు. తాను రాష్ట్రంలో యాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం సమస్య, భారీ అవినీతి, ధరల పెరుగుదల, రైతులుకు తీవ్ర ఇబ్బందులు, యువతకు ఉద్యోగాలు లేవని ప్రజలు తనకు చెప్పారన్నారు. ఈ సమస్యలన్నింటినీ తాము లెవనెత్తుతున్నామని రాహుల్ అన్నారు. ఈ యాత్ర దేశానికి బలాన్ని అందించే ఐదు న్యాయ స్తంభాలలైన భాగస్వామ్యం, యువత, కార్మికులు, మహిళలు, రైతులకు న్యాయం గురించి సాగుతుందన్నారు. ఈ ఐదు న్యాయ స్తంభాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బ్లూప్రింట్‌ను వచ్చే నెలలో ముందుకు తెస్తుందని ఆయన చెప్పారు.
యాత్రలో ఉద్రిక్తత
కాగా, అంతకు ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు అసోంలో అడ్డంకులు ఎదురయ్యాయి. గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అడ్డుకోవడం ఆందోళనకు దారితీసింది. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. గుహవటి నగర శివారులో పార్టీ మద్దతుదారులనుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ బారికేడ్లు మాత్రమే ఛేదించుకొని వెళ్లామని, చట్టాన్ని అతిక్రమించబోమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గువాహటిలోకి యాత్రను అనుమతించలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇదివరకు పేర్కొన్నారు. అయితే, రాహుల్‌కు స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో కార్యకర్తలు ఖానాపారాలోని గువాహటి చౌక్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేస్తూ రాహుల్‌కు స్వాగతం పలికారు. ‘పోలీసుల బారికేడ్లు తొలగించుకొని వచ్చాం. మేం గెలిచాం’ అని అసోం ఎఐసిసి ఇంఛార్జ్ జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. యాత్ర గువాహటిలోకి ప్రవేశించకముందు అసోం- సరిహద్దులో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్రం, అసోం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలోని విద్యార్థులను బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎవరూ భయపడవద్దని అన్నారు. మేఘాలయలో విద్యార్థులను కలవకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు. అసోం సిఎంకు అమిత్ షా ఫోన్ చేసి తనను అడ్డుకోవాలని ఆదేశించారని అన్నారు. ‘మమ్మల్ని ప్రతిచోట అడ్డుకుంటున్నారు. విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడకూడదని అసోం ముఖ్యమంత్రికి ఈ దేశ హోంమంత్రి ఫోన్ చేశారు. యూనివర్సిటీ అధికారులకు సిఎం ఫోన్ చేసి మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం అనేది ముఖ్యం కాదు. విద్యార్థులు తమకు నచ్చిన వ్యక్తి ప్రసంగాన్ని వినడం ముఖ్యం. అసోంలోని ఏ విద్యాసంస్థలోనూ విద్యార్థులకు ఈ స్వేచ్ఛ లేదు. మీ భాష మాట్లాడకూడదు, మీరు సొంత చరిత్ర కలిగి ఉండకూడదని వారు అంటున్నారు. తమను తాము బలహీనులని ఎవరూ అనుకోవద్దు. మిమ్మల్ని ఆలోచించనీయకుండా ఎవరూ అడ్డుకోలేరు. మీకు నచ్చిన భాషలో చదువుకోకుండా ఎవరూ ఆపలేరు. మీకు నచ్చిన మతాన్ని విశ్వసించకుండా నిలువరించలేరు. యూనివర్సిటీలో జరగాల్సిన నా కార్యక్రమాన్ని వారు అడ్డుకున్నారు. కానీ మీరు (విద్యార్థులు) యూనివర్సిటీ బయట నా ప్రసంగం వినేందుకు వచ్చారు. విద్యార్థుల ఆలోచనలకు కళ్లెం వేస్తే భారత్ మనుగడ సాధించలేదు. విద్యార్థులు ఎవరికీ భయపడకూడదు. మీరే ఈ దేశానికి భవిష్యత్తు’ అని -రాహుల్ గాంధీ అన్నారు.
- రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి : హిమంత ఆదేశం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు హిమంత శర్మ ఆదేశాలు జారీచేశారు.