HomeNewsBreaking Newsన్యాయవ్యవస్థనూ శాసించేందుకు ముమ్మరం యత్నం

న్యాయవ్యవస్థనూ శాసించేందుకు ముమ్మరం యత్నం

ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రమాదంలోకి నెడుతున్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి
‘ఇంటింటికీ సిపిఐ’ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకే ప్రజల వద్దకు ‘సిపిఐ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా అన్నారు. ‘బిజెపి హఠావో దేశ్‌ బచావో‘ అనే నినాదంతో ‘ఇంటింటికీ సిపిఐ’ కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని అడ్డగుట్టలో పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని స్వతంత్ర సంస్థలను బిజెపి సర్కార్‌ తన ఆధీనంలోనికి తీసుకుంద ని, న్యాయవ్యవస్థను కూడా శాసించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రమాదంలోనికి నెడుతున్న బిజెపి, ఆ పార్టీ అనుకుల శక్తుల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం అని తెలిపారు. నరేంద్ర మోడీ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోగా… జిఎస్‌ టి వంటి అనాలోచిత నిర్ణయాలలతో అనేక కంపెనీలు మూతపడి కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. అచ్చేదిన్‌ అంటూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం,పేదరికం, ద్రవ్యోల్బణం తగ్గించకుండా మత రాజకీయాలను చేస్తూ యువతను పక్కదారిపట్టిస్తూ అధికారం అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. తమ చెమట,నెత్తురుతో సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. దోపిడీ వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సంస్థలను,ఆస్తులను అదానీకి అప్పగిస్తున్నారని, దీనిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తున్న అభ్యుదయ, ప్రజాస్వామ్య మేధావులపై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించి అణిచివేత కొనసాగిస్తున్నారన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇటి నరసింహ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమానమైన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రాయబడిందన్నారు. 2014 తర్వాత కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన బిజెపి ప్రభుత్వం, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు స్టాలిన్‌, కమతం యాదగిరి, సికింద్రాబాద్‌ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి ఉమర్ఖాన్‌, కొమురెల్లి బాబు డివిజన్‌ కార్యదర్శులు పాకాల యాదగిరి, సోమయ్య, ఎస్‌.కె లతీఫ్‌, గౌరీ నాగరాజ్‌, బాలరాజ్‌,రషీద్‌,ఖదీర్‌,శంకరయ్య, ఖాజా మియా,రంజిత్‌సింగ్‌, రమేష్‌అంజి,చారి, పద్మ,రూప,చందర్‌,అజయ్‌, రామ్‌ చందర్‌,కాసిం, యాదగిరి, సింగారయ్య తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments