విమాన ప్రయాణికులకు డిజిసిఎ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి మాస్క్ ధరించడం అత్యవసరమని వైద్య నిపుణులు పదేపదే చెప్తున్నప్పటికీ ఎక్కువ మంది ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది వాస్తవం. ఇటీవల కాలంలో కొవిడ్ పాజిటివ్ కేసులో భారీగా పెరగడంతో, పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై స్పందిస్తూ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా డిజిసిఎ శనివారం ఒక సర్క్యులర్‌ను అన్ని విమానయాన సంస్థలకు పంపింది. మాస్క్ లు సరిగ్గా ధరించకపోతే కిందికి దించేస్తామని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని ప్రయాణికులకు స్పష్టం చేసింది. కొత్త నిబంధనల పేరకు విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. దానితోపాటుసామాజిక దూరాన్ని కూడా పాటించాలి. ఆ మాస్క్ ముక్కు కిందకు ఉండకూడదు. ముక్కు, మూతి పూర్తిగా కవర్ అయ్యే విధంగా మాస్క్‌ను ధరించాల్సి ఉంటుంది. విమానాశ్రయ ప్రవేశద్వారాల వద్ద సిఐఎస్‌ఎఫ్, పోలీస్ సిబ్బంది ప్రయాణికులను నిరంతరం గమనించాలి. మాస్క్ లేకుండా విమానాశ్రయంలోకి ఎవరినీ అనుమతించరాదు. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ధరించి, సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యత టర్మినల్ మేనేజర్ లేదా ఇతర సిబ్బందిపై ఉంటుంది. ఎవరైనా కొవిడ్ 19 నిబంధనలు పాటించకపోతే, అలాంటి వారిని వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించాలి. విమానంలోకి ఎక్కిన తర్వాత అందరూ మాస్క్‌లు పెట్టుకున్నారా? లేదా? అనేది గమనించాలి. సిబ్బంది హెచ్చరించినా మాస్క్ పెట్టుకోకపోతే, అలాంటి ప్రయాణికులను విమానం బయలుదేరక ముందే దింపేయాలి. ఈ విషయంలో భద్రతా సిబ్బంది సాయం తీసుకోవాలి. ఒకవేళ విమానం బయలుదేరిన తర్వాత కొవిడ్ నిబంధనలు పదే పదే ఉల్లంఘించినట్టు కనిపిస్తే, అలాంటి వారి పేర్లను ’నిషేధిత జాబితా’లో చేర్చాలి. సదరు విమానయాన సంస్థ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని డిజిసిఎ తన సర్క్యులర్‌లో సూచించిది.
నో మాస్క్…నో ఎంట్రీ
RELATED ARTICLES