HomeOpinionEditorialనోరు మంచిదైతే...

నోరు మంచిదైతే…

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది పెద్దలు అనుభవంతో చెప్పిన సూక్తి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు కోపమొస్తే తిట్లు, దూషణలు నోటివెంట అలవోకగా తన్నుకుంటూ వస్తాయి. జాతక ఫలాలను విశ్వసించి ఎన్నో ఆశలతో 9 నెలలముందే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలు తెచ్చిపెట్టుకుంటే అవి బెడిసికొట్టే అపశకునాలు ఆయన ఆగ్రహానికి కారణమనవచ్చు. నభూతో నభవిష్యత్ అన్నట్లు, నేల ఈనినట్లు బ్రహ్మాండమైన బహిరంగసభ జరిపి ప్రతిపక్షాలను బెంబేలెత్తించాలనుకున్న కొంగరకలాన్ సభ ఆయనకు తొలి షాక్ ఇచ్చింది. 25లక్షలమంది జనసమీకరణ లక్షం అంతకు అనేక రెట్లు ఖర్చుపెట్టినా 5లక్షలు దాటలేదు. రెండు, తాను మింగేశాననుకున్న తెలుగుదేశం పార్టీ (ఓ డజనుమంది టిడిపి ఎమ్మెల్యేలను అదిరించో బెదిరించో ఆదరించో టిఆర్ చేర్చుకున్నప్పుడు టిడిపి టిఆర్ విలీనమైనట్లు స్పీకరు మధుసూదనాచారి ప్రకటించటం గుర్తు చేసుకోదగింది) పునరుద్ధానం పొందింది. ఎన్నికల పొత్తును టిఆర్ తిరస్కరించటంతో అది కాంగ్రెస్ నాయకత్వంలోని మహా(జన)కూటమిలో చేరటం కెసిఆర్ చిర్రెత్తించి ఉంటుంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనిలా దాపురించాడంటూ ధ్వజమెత్తాడు. కొంగరకొలాన్ ఇతర సభల్లో కూడా దూషణలకు ఒడిగట్టారు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావులు అనేక సభల్లో చంద్రబాబుపై పరుషమైన భాష ఉపయోగించారు. నీళ్లదొంగ వగైరావగైరా దూషణలు గుప్పించారు. కాంగ్రెస్ అడ్డంపెట్టుకుని తెలంగాణపై పెత్తనం చేయజూస్తున్నాడని, టిడిపికి ఓటేస్తే అది అమరావతికి పోతుందని, ఇక్కడి టిడిపి నాయకులు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగు తున్నారని దూషించారు. హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో దశాబ్దాల నుంచి స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు వాటిని స్వీకరించటంలేదని, జిహెచ్ ఎన్నికల్లోవలెగాక అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు బహుశా ఆపద్ధర్మ ప్రభుత్వ నేతకు అందిఉంటాయి. ఆయన కుమారుడు కె.తారకరామారావు బుజ్జగింపు చర్యలు చేపట్టినట్లు ఆదివారంనాడు నిజాంపేటలో కూకట్ శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తక్షణ మాజీ (టిడిపి) టిఆర్ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం అభ్యర్థులు ‘మన హైదరాబాద్ హైదరాబాద్’ పేరుతో వివిధ కాలనీ అసోసియేషన్ వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగం తెలియచేస్తున్నది. తెలుగుదేశం పార్టీని నెలకొల్పి తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. ఎగువవారు ప్రాజెక్టులు కడితే దిగువ రాష్ట్రమైన తమకు నీళ్లు రావేమోనన్న ఆందోళనతో లేఖలు రాసి ఉండవచ్చునన్నారు. ‘ఈ నాలుగేళ్లలో మా వ్యవహారశైలి మీకే తెలుసు. ఎక్కడైనా ప్రాంతీయాభిమానం, ప్రాంతీయ వివక్ష కనిపించిందా? అని సభికులను ప్రశ్నించారు. ఉద్విగ్నంగా, ఉద్వేగపూరితంగా మాటల తూటాలు పేల్చుతున్నప్పుడు కొంత నొప్పి కలిగించినట్లు అనిపిస్తుంది. అవి చంద్రబాబుపై విమర్శలేతప్ప ఆంధ్రులపై కాదన్నారు. “ఇక్కడ ఉండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలారా నన్ను సోదరుపిగా భావించండి. మీ అందరికి వ్యక్తిగతంగా అండగా ఉంటానని కెసిఆర్ కుమారుడిగా, టిఆర్ నాయకుడిగా హామీ యిస్తున్నా. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కనపెట్టండి…రాష్ట్రంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టే పనేమీ చేయలేదు. మీరు మమ్మల్ని ఇబ్బందిపెట్టే పనిచేయవద్దు” అని విజ్ఞప్తి చేశారు. జిహెచ్ ఎన్నికలలాగా టిఆర్ అభ్యర్థులనే గెలిపించాలన్నది ఆయన మనవి. ఏమైనా, రాజకీయాల్లో అందునా ఎన్నికల సమయంలో నిందలు, ఆరోపణలు నివారించ లేనివి. కాని ఉన్నత స్థాయి నాయకులు భాషను నియంత్రించు కోలేకపోతే ఇబ్బందులపాలవు తారు. ఇక్కడ స్థిరపడినవారే కాదు స్థానికులు సైతం అటువంటి పరుషమైన భాషను ఇవాళ స్వీకరించరని గ్రహించటం మంచిది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments