నోయిడా: వివాదాస్పదంగా మారి, చివరికి సుప్రీం కోర్టు వరకూ చేరిన ‘ట్విన్ టవర్స్’ను అత్యంత పకడ్బందీ చర్యలు, ఏర్పాట్ల మధ్య కూల్చివేశారు. ఎమరాల్డ్ కోర్టు సొసైటీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా ఈ ట్విన్ టవర్స్‌ను సూపర్‌టెక సంస్థ నిర్మించింది. కుతుబ్ మీనార్ కంటే ఎత్తయిన ఈ జంట భవనాల నిర్మాణ సమయంలో ఎలాంటి నియమనిబంధనలను పాటించలేదని గుర్తించిన సుప్రీం కోర్టు, వాటిని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముందుగానే సరిసర ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయించారు. కూల్చివేత సమయంలో ట్రాఫిక్‌ను కూడా నిలిపివేశారు. ఎడిఫైస్ సంస్థ చేపట్టిన కూల్చివేత కార్యక్రమం కేవలం 9 సెకన్లలో పూర్తయింది. ట్విన్ టవర్స్ పేకమేడల్లా కూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా దుమ్ము, ధూళి ఆవరించగా, టవర్స్ కూలిన ప్రాంతంలో శిథిలాలు సుమారు 80,000 టన్నుల వరకూ ఉన్నాయి. వీటిలో సుమారు 50,000 టన్నులను బేస్‌మెంట్‌ను నింపేందుకు వినియోగిస్తారు. మిగతా 30,000 టన్నుల శిథిలాలను రీప్రోసెసింగ్ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేర ట్విన్ టవర్స్‌ను నేలమట్టం చేసేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. రెండు భవనాలో 7,000 రంధ్రాలు చేసి, వాటిలో పేలుడు పదార్థాలు నింపారు. 20,000 సర్క్యూట్లను ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో ఉన్న బటన్ నొక్కడం ద్వారా భవనాలు నేలమట్టం అయ్యాయి. నోయిడా అథారిటీ మార్గదర్శకత్వంలో సూపర్‌టెక్ సంస్థ తన సొంత ఖర్చుతో భవనాలను కూల్చివేసింది. ఈ ట్విన్ టవర్స్‌ను నోయిడాలోని సెక్టార్ 93ఏ వద్ద నిర్మించారు. ఒక భవనం ఎత్తు 103 మీటర్లుకాగా, మరొక భవనం ఎత్తు 97 మీటర్లు. ఈ రెండు భవనాలను కూల్చివేయాల్సిందిగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. కూల్చివేతకు ముహూర్తం ఖరారైన తర్వాత సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ టవర్ల సమీపంలోని భవనాల్లో దుమ్ము, ధూళి చొరబడకుండా జియో టెక్స్‌టైల్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. వీటి సమీపంలోని ఎమరాల్డ్ కోర్టు, ఎటిఎస్ విలేజ సొసైటీలోని సుమారు 5,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు సొసైటీల్లోనూ వంట గ్యాస్, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అక్కడ ఉంటున్న వ్యక్తులతపాటు వారివారి వాహనాలను, పెంపుడు జంతువులను కూడా తరలించారు. కూల్చివేత ప్రక్రియ ప్రారంభానికి సుమారు పావుగంట ముందు నుంచే నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను నిలిపివేశారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తగిన రీతిలో స్పందించేందుకు అగ్నిమాపక దళాలలను, అంబులెన్సను సిద్ధంగా ఉంచారు. ఫెలిక్స్ ఆసుపత్రిలో 50 బెడ్స్‌ను కూడా అధికారులు ముందుగానే బుక్ చేశారు. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండానే ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తయింది. నోయిడాలోని ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ సొసైటీలో సూపర్‌టెక్ సంస్థ అపెక్స్, సియెన్ టవర్స్ నిర్మాణాన్ని 2004లో ప్రతిపాదించారు. ఎమరాల్డ్ సొసైటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, నిర్మాణాలు జరిగిపోయాయి. అపెక్స్‌ను 32 అంతస్థులు, సియెన్‌ను 29 అంతస్థులతో నిర్మించారు. నిబంధనలను పట్టించుకోలేదంటూ సూపర్‌టెక్ సంస్థపై ఎమరాల్డ్ కోర్టు సోసైటీ 2012లో కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం అక్రమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వీటిని కూల్చివేసి, అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు డబ్బు వాపసు ఇచ్చేయాలని 2014లో తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సూపర్‌టెక్ సంస్థ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వాదోపవాదనల అనంతరం అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు సమర్థించింది. ట్విన్ టవర్స్‌ను కూల్చేయాల్సిందేనని 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏడాది సమయం పట్టింది. ఎట్టకేలకు టవర్స్‌ను కూల్చివేశారు. ఈ కూల్చివేత కారణంగా సంస్థకు సుమారు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సూపర్‌టెక్ చైర్మన్ ఆర్‌కె ఆరోరా ఒక ప్రకటనలో తెలిపారు.
నోయిడా ‘ట్విన్ టవర్స్’ కూల్చివేత

RELATED ARTICLES