7న కేరళను తాకవచ్చు : భారత వాతావరణశాఖ
న్యూఢిల్లీ: రుతుపవనాలు మరో రోజు ఆలస్యం అయి జూన్ 7న కేరళను తాకవచ్చని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఇదివరలో స్కైమెట్ అనే ప్రయివేట్ వాతావరణ సంస్థ రుతుపవనాలు జూన్ 4 నుంచి 7 మధ్య రావొచ్చని తెలిపింది. భౌగోళిక శాస్త్ర మంత్రి హర్ష వర్ధన్ రుతుపవనాలు జూన్ 6 నుంచి 7 మధ్య రావచ్చని ఇదివరలో తెలిపారు. రుతుపవనాలు 96 శాతం లాంగ్ పీరియడ్ యావరేజ్(ఎల్‌పిఎ) స్థాయిలో ఉండొచ్చని కూడా ఆయన తెలిపారు. అంటే అది నార్మల్, బిలో నార్మల్ కేటగిరి హద్దులో ఉండవచ్చని తెలుస్తోంది. దేశంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఎగబాకుతుండడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలులు వీస్తూనే ఉన్నాయి. కాగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వడగాలులు వీస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని చురులో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌గా మంగళవారం నమోదయింది. ఇదిలావుండగా కొన్ని ప్రాంతాల్లో వానలు పడడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. జమ్ము ప్రాంతంలో అత్యంత వేగంగా దుమ్ము గాలులు వీచాయి. ఓ చెట్టు విరిగిపడడంతో ఓ బిడ్డ చనిపోగా, ఆ బిడ్ద తల్లికి గాయాలయ్యాయి. అధికారులు వైష్ణోదేవి యాత్రను స్వల్ప కాలానికి ఆపేశారు కూడా. చెట్లు విరిగిపడడంతో వైష్ణోదేవి ఆలయ మార్గంలో ఉన్న ఆరు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌లలోని కొన్ని ప్రదేశాల్లో వానలు కురిసాయి. గుజరాత్‌లోని పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రత 44.9 నుంచి 46.8 డిగ్రీల సెల్సియస్‌ల మధ్య ఉంది. రాగల రెండు రోజుల్లో ఉష్ణోగ్రత్తలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాలులు కొనసాగుతాయని తెలిపింది. హర్యానాలోనైతే వడగాలులు శుక్రవారం వరకు కొనసాగుతాయని చెప్పింది.