మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మరోసారి నిప్పులు చెరిగారు. యూపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసును పునర్ విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమ విజయంగా మోడీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. బుధవారం చిదంబరం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆదాయ మదింపు విషయంలో సోనియా, రాహుల్‌పై మోడీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సుప్రీం ఆదేశాలను ఆయనకు ఎవరు వివరించారో వారిపై వెంటనే వేటు వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సుప్రీం ఉత్తర్వులపై మోడీయే సొంతం నిర్ణయం మేరకు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే ఆయన ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలన్నారు. సుప్రీం ఉత్తర్వులపై సరైన అవగాహన లేకనే మోడీ ఇలాంటీ కామెంట్స్ చేసినట్లు వెల్లడించారు. ఇక 2011-2012లోని నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ల ఆదాయ మదింపునకు సంబంధించిన అంశంపై పునర్ విచారణ చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ఛాయ్‌వాలా ధైర్యానికి ప్రతీకగా అభివర్ణించారు. న్యాయస్థానం ఆదేశాలు నిజాయితీ గల వారి విజయంగా పేర్కొన్న విషయం తెలిసిందే.
నేషనల్ హెరాల్డ్ కేసులో మోడీ వ్యాఖ్యలు అర్ధరహితం
RELATED ARTICLES