HomeOpinionArticlesనేర అభ్యర్థులారా ! మీ చిట్టా విప్పండి!

నేర అభ్యర్థులారా ! మీ చిట్టా విప్పండి!

రాజకీయాలు నేరస్థులమయం కావటంపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 25న ఇచ్చిన తీర్పు రోగానికి పూతమందు తప్ప విరుగుడు చికిత్స కాదు. అయితే అది తమ అధికారాల పరిధికిలోబడి తీర్పుచెప్పింది. రాజకీయాల్లో నేరస్థులు పెరగటంపై ఆందోళన వ్యక్తంచేస్తూనే, చట్టం చేయవలసిన అధికారం పార్లమెంటుది తప్ప తమది కాదని స్పష్టం చేసింది. నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించ లేని తమ నిస్సహాయత కారణంగా ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు చాలా కాలంగా విజ్ఞప్తులు చేస్తోంది. చివరకు కోర్టు తలుపుతట్టింది. అయితే తీర్పు ఆ బాధ్యతను ఎన్నికల కమిషన్ పెట్టింది. భారత ఎన్నికల కమిషన్ మాజీ ప్రధానాధికారి ఎస్ అభిప్రాయం ప్రకారం, “తాను పార్లమెంటు పాత్ర వహించలేనని కూడా కోర్టు చెప్పింది. అయితే పార్లమెంటు ఏ పార్టీల సంకీర్ణం అధికారంలో ఉన్నప్పటికీ తన సొంత న్యాయమైన పాత్రను నిర్వర్తించటం లేదు. రాజ్యాగంలోని ఆర్టికల్ 102(1) ప్రకారం ఈ విషయంలో చట్టం చేయవలసిన బాధ్యత పార్లమెంటుది. అయితే మనం చరిత్రను చూచినట్లయితే, సుప్రీంకోర్టు తీర్పుననుసరించి చట్టం చేసిన సందర్భం బహు అరుదు.” అయితే ఏమి చేయాలన్నప్పుడు, “కార్య నిర్వాహకవర్గం, లెజిస్లేచర్ తమ పనిచేయటానికి సుముఖంగా లేనప్పుడు న్యాయవ్యవస్థ క్రియాశీలత అనేకసార్లు దేశాన్ని కాపాడింది. ఈ విషయంలో లెజిస్లేచర్ కదలిక లేదని చరిత్రనుంచి మనకు తెలుసు. న్యాయవ్యవస్థ క్రియాశీలమైన చర్య తీసుకుని ఉంటే స్వాగతించబడేది” అని అభిప్రాయపడ్డారు ఖురేషి.
ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ పార్టీలు ఒకప్పుడు నేరస్థుల సహాయం తీసుకునేవి. కాగా కాలంతోపాటు వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నాయకత్వాల్లోకి రౌడీలు చేరుతున్నారు, రాజకీయ నాయకులు రౌడీలవు తున్నారు. రాజకీయపార్టీలు కులం, మతం, ప్రాంతం వగైరా పరిగణనలతోపాటు ఎన్నికల్లో గెలవటానికి ధనబలంతోపాటు కండబలం కూడా అవసరంగా ఎంచి నేరస్థులకు పార్టీ టిక్కెట్ ఇస్తున్నాయి. గత మూడు లోక్ నేరచరిత్రగల ఎంపిల సంఖ్య చట్టసభల్లో నేరచరిత్రుల పెరుగు దలకు అద్దంపడుతోంది. వారు 2004 లో 128, 2009 లో 162, 2014 లో 184 మంది.
కోర్టు ముందుకొచ్చిన సమస్య
ఏ నేరారోపణ కింద అయినా దిగువ కోర్టులో రెండేళ్లు ఆ పైన జైలుశిక్షకు గురైన చట్టసభ సభ్యుడు వెంటనే సభ్యత్వం కోల్పోవటం, అనేక సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోవటం చట్టరీత్యా ప్రస్తుతం అమలులో ఉంది. ముద్దాయి పై కోర్టుకు అప్పీలు చేసుకోగానే ఆ శిక్ష నిలుపుదల కావటం, ఆ వ్యక్తి చట్టసభలో సభ్యునిగా కొనసాగ టమేగాక పదవులు చేబట్టి ఏలుబడి సాగించే అవకాశం అంతకుముందు ఉండింది. చట్టసభల్లో నేరస్థుల ప్రవేశాన్ని అరికట్టే నిమిత్తం ఎన్నికల కమిషన్, లా కమిషన్ అభిప్రాయం మద్దతుతో చట్టాన్ని మరింత కఠినం చేసేటట్లు ఆదేశించాలని సుప్రీంకోర్టునుఅర్థించింది. నీచమైన నేరారోపణల కు (హత్య, మానభంగం, కిడ్నాపింగ్, బందిపోటు తనం వగైరా) గురై, కనీసం ఐదు సంవత్సరాలు జైలుశిక్ష అవకాశమున్న కేసుల్లో కోర్టు ఛార్జిషీటు ఖరారు చేసిన తదుపరి అట్టి వ్యక్తులను పోటీ చేయటానికి అనర్హుల్ని చేయాలన్నది ఎన్నికల కమిషన్ అభ్యర్థన. దీన్ని అనేక పార్టీలు ప్రధానంగా రెండు కారణాలతో వ్యతిరేకించాయి. ఒకటి, పాలక పార్టీ నాయకులు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా దీన్ని దుర్వినియోగం చేస్తారు. రెండు, ఏ వ్యక్తినైనా దోషి గా నిర్ధారించి, శిక్ష విధించేవరకు అతడు/ఆమె అమాయకుడిగానే పరిగణించబడ తాడని చట్టం చెబుతోంది.
కోర్టు ఆదేశించిన మార్గం
అటువంటి వ్యక్తులను ఎన్నికల్లో పోటీనుంచి నిషేధించాలంటే ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 8ని సవరించాలి. ఆ పని చేయాల్సింది పార్లమెంటు తప్ప కోర్టు కాదు. అందువల్ల నేరచరిత్ర ఉన్న అభ్యర్థుల గూర్చి ఓటర్లను చైతన్యపరిచేందుకు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఆదేశించింది.
1.నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు ఆ వివరాలను తమ పార్టీకి తెలియచేయాలి. టిక్కెట్టు ఇచ్చినట్లయితే అట్టి అభ్యర్థుల చరిత్రను పార్టీ వెబ్ పెట్టాలి.
2.అట్టి అభ్యర్థులు నామినేషన్ పత్రంతోపాటు సమర్పించే కేసుల అఫిడవిట్ నీచమైన నేరా రోపణలను పెద్ద అక్షరాల్లో రాయాలి. ఎన్నికల కమిషన్ దాన్ని ప్రచురించాలి. అభ్యర్థి ఇచ్చే సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే తన వెబ్ పెడుతోంది. (ఢిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఎడిఆర్ వాటిని విశ్లేషించి ఆ తదుపరి కాలంలో అభ్యర్థుల ఆర్థికస్థితిని, నేరచరిత్రను ప్రచురిస్తుంటుంది.)
3. అభ్యర్థి నేరచరిత్రను సంబంధిత రాజకీయ పార్టీ, ప్రముఖ వార్తాపత్రికల్లో, టెలివిజన్ ఛానల్స్ మూడుసార్లు ప్రచురించాలి.
ఇది అభ్యర్థిని బహిరంగంగా అవమానపరచ టానికి, సరైన అభ్యర్థిని ఎంచుకునేలా ఓటర్లను చైతన్యపరచటానికీ దోహదం చేస్తుందనేది దీని వెనుక ఉన్న తర్కం. అయితే వెబ్ ప్రదర్శన లాంఛనమే. ఎందుకంటే అవి కలిగి ఉన్నవారు బహు తక్కువ శాతం. పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణ, ప్రదర్శన కొంతమేరకు సమర్థవంతంగా పనిచేయవచ్చు. రానున్న ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ దీన్ని ఎలా అమలు జరుపుతుందో, అది ప్రయోజనకారి అవుతుందో లేదో వేచిచూద్దాం.
అయితే రాజకీయాల్లో, చట్టసభల్లో నేరస్థుల పాత్ర అరికట్టటం రాజకీయపార్టీల బాధ్యత కాదా? అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు అటువంటి వారికి అవి టిక్కెట్టు ఎందుకు నిరాకరించవు? నేరస్థులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావట మన్నది చట్టసభలకే పరిమితం కాదు. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నుంచే మొదలవుతోంది. అటువంటప్పుడు ప్రజాప్రాతినిధ్య సభలు హుందాగా ఎలా వ్యవహరించ గలుగు తాయి? అందువల్ల ప్రజలు రాజకీయ పార్టీలను నిలదీయాలి. సచ్ఛీలురకే టిక్కెట్ ఇవ్వాలని ఒత్తిడి చేయాలి. రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి కాబట్టే కోర్టు జోక్యం అవసరమవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments