పత్రికలు, టివీల్లో ప్రకటనలిచ్చారా?
ఇస్తే .. యాడ్స్ బిల్స్ వారి ఖర్చుల్లోనే
అసెంబ్లీ మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం చర్యలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుసరించిన విధంగానే ఇప్పు డు లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై ఇసి అన్ని చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు చట్టసభలకు ఎన్నికయ్యే ప్రమాదం ఉండడంతో వారి గత నేర చరిత్ర తాలూకు పుట్టు పూర్వోత్తరాలను ఓటర్లకు తెలిసేలా జాగ్రత్త పడుతోంది. అభ్యర్థులపై కేసులు, జైలు కెళ్తే ఆ వివరాలు, ఎన్నాళ్లు ఏఏ కేసుల్లో శిక్ష అనుభవించారు, ఇంకా తమపై ఏమైనా అభియోగాలు ఉన్నాయా? తదితర అంశాలను కూడా నామినేషన్ పత్రాల్లో సమర్పించారా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అలాంటి అభ్యర్థులు ఉంటే టివిలు, పత్రికా ప్రకటనల్లో అభ్యర్థులే స్వయంగా తమ నేర ప్రవృత్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓటర్లకు యాడ్స్ రూపేణా తెలియ పరచాల్సి ఉంది. ఇలాంటి యాడ్స్ ఇచ్చారా? లేదా అన్న దానిపై ఇసి నిఘా వేసింది. టివిల్లో అయితే అందరూ చూసే సమయాల్లో అంటే పగటి పూట ఉదయం 6.00 నుండి రాత్రి 9.00 గంటలలోపున, అలాగే పత్రికల్లో ప్రముఖంగానే యాడ్స్ వచ్చేలా చూసుకోవాలని అభ్యర్థులకు ఆదేశాలు జారీ చేశారు. యాడ్ ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే వేస్తారు.