వాసాలమర్రి నుంచి ‘దళితబంధు’ ప్రారంభం
వాసాలమర్రిలో అందరికీ ఇళ్లు
దళితబంధుకు ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్‌లేదు
అర్హతను బట్టి యథావిధిగా ఇతర పథకాలు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటన
దళితవాడల్లో మూడు గంటలపాటు పర్యటన
ప్రజాపక్షం/యాదాద్రి ప్రతినిధి ‘దళితబంధు’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని బుధవారం సందర్శించిన సిఎం కెసిఆర్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని 76 కుటుంబాలకు గురువారం నుంచి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. గ్రామంలోని దళితవాడల్లో సుమారు 3 గంట ల పాటు కాలినడకన తిరుగుతూ దళితుల సమస్యలను తెలుసుకున్నారు. ఆనంతరం గ్రామ సమగ్రాభివృద్ధి కోసం గ్రామంలోని 120 మందితో రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎం మాట్లాడుతూ దళితులు కష్టపడేతత్వం కలవారని, దళిత సమాజం పూర్తిగా గొప్పగా ఎదగలేదని, వారు రోజంతా కష్టపడి పని చేస్తారని, సంపద సృష్టించేదే దళితులని, అలాంటివారు పేదరికంలో ఉండవద్దని, వ్యాపారం, స్వశక్తితో స్వయంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఇప్పటి నుంచే దళితబంధు పథకం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటిస్తూ, వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు గురువారం నుంచే ఖాతాలలో జమ అవుతాయని వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా సమాజం ఆర్థికంగా పైకి ఎదగాలని, వాసాలమర్రి గ్రామం ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలని ఆకాంక్షించారు. దళితబంధులో భాగంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దళిత రక్షణ నిధి ద్వారా దళితుల ఆరోగ్యం, అనుకోకుండా వచ్చే కష్టాలలో దెబ్బతినకుండా ఉపయోగపడుతుందన్నారు. దీనిపై ఎవరి పెత్తనం ఉండదని, దళిత రక్షణ నిధిలో గ్రామం, మండలం, జిల్లా కమిటీల పర్యవేక్షణలో దళితుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు అరకొరగా, అసంపూర్తిగా చేసిన కార్యక్రమాల వల్ల దళిత సమాజానికి పూర్తిగా పథకాలు, వాటి ఫలాలు అందలేదని అన్నారు. ఏడాది కిందనే దళితబంధు అమలు కావాల్సి ఉందన్నారు. దళితబంధు పథకం ఆరునూరైనా గొప్పగా అమలు చేస్తామని వెల్లడించారు. దళితులు స్వయం కృషితో, మొండి పట్టుదలతో పట్టుబట్టి 100 శాతం అభివృధ్ధి సాధించి చూపాలని, దళితుల మధ్య ఐకమత్యం ఉండాలని, ఎలాంటి పోలీస్ కేసులు ఉన్నా రద్దు చేసుకోవాలని, దళితబంధు పథకాన్ని విజయవంతం చేసుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్, ఎంపిటిసిని పిలిపించుకుని వాసాలమర్రి అభివృద్ధికి కార్యాచరణ చేశామని, కలెక్టర్ నేతృత్వంలో గొప్పగా అమలు చేస్తామని తెలిపారు. ఎర్రవల్లి దళితవాడలో అందరి సహకారంతో జరిగిన అభివృద్ధి వాసాలమర్రిలో కూడా జరగాలని ఆకాంక్షించారు. వాసాలమర్రి లో దళిత కుటుంబాలు భూమి లేకుండా ఉన్నాయని, భూమి ఉన్న వారు ఎంత మంది, వారికి ఎంత ఉంది, భూమి లేని వారు ఎంతమంది అనేది పరిశీలిస్తున్నామని, ఆక్రమణలకు గురైన దళితుల భూములను తిరిగి రికవరీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 15 నుండి 16 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, వీరిలో ఎలాంటి ఆధారం లేని వారికి దళిత బంధు పథకం ద్వారా వారి ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. దళిత సమాజంలోని చదువుకున్న యువకులు ఎక్కువ బాధ్యత తీసుకొని, కుటుంబ సభ్యుల సమిష్టి ఆలోచనలతో వ్యాపారం కానీ, ట్రాక్టర్, పాల వ్యాపారం తదితర రంగాలలో కృషి చేసి స్వయంకృషితో ఎదగాలని సూచించారు. స్థానిక ఎంఎల్‌ఎ గొంగిడి సునీతారెడ్డి వాసాలమర్రిలోని ప్రతి దళిత ఇంటిని సందర్శించి, దళిత బంధు పథకంలో వారు ఎదిగేలా కృషిచేయాలని, వారికి అనుభవం ఉన్న వాటిలో, ఆసక్తి కనపరిచిన వాటిలో రాణించేలా అవగాహన చర్యలు చేపట్టాలని, వారిని ముందుండి నడిపించాలని సూచించారు. రానున్న 15 రోజులలో భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఆరు నెలల తర్వాత దళితవాడలో తిరిగి సమావేశమై అందరం భోజనం చేద్దామని, ఎవరెవరు ఎలా అభివృద్ధి చెందుతున్నారనేది మాట్లాడుకుందామన్నారు. ఇండ్లు కూడా పాతవి తీసేసి కొత్త ఇండ్లు కట్టుకుందామని, ఊరితో పాటు దళిత సమాజం అభివృద్ధి చెందేలా, వాసాలమర్రి బంగారు వాసాలమర్రిగా రూపొందేలా సమిష్టి కృషి చేద్దామని కర్తవ్య బోధన చేశారు.
ఊరందరికీ ఇండ్లు కట్టిస్తా
దళితబంధు ఇచ్చినందుకు ఇతర పథకాలు దళితులకు బంద్ కావని, అలాంటి అనుమానాలు ఉంటే మనస్సులోంచి తీసివేయాలని సిఎం స్పష్టం చేశారు. వాసాలమర్రి ఊరందరికీ నూతన ఇండ్లు కట్టిస్తానని ప్రకటించారు. దళితులకు ఇచ్చే రూ. 10 లక్షలకు ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ లేదన్నారు. అన్ని పథకాలతో పాటు అదనంగా ఇచ్చే ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మర్వాడీల మాదిరిగా డబ్బుకు డబ్బు సంపాదించే మార్గాన్ని నేర్చుకోవాలని సూచించారు. తొందర పడకుండా మంచి వ్యాపారం ఏం చేయాలన్నది నిర్ణయించుకుని కలెక్టర్‌కు చెప్పాలన్నారు. ఇప్పటికే డబ్బులు మంజూరైనందున పదిహేను రోజులైనా సరే మంచి వ్యాపారాన్ని ఎంచుకోవాలని కోరారు. సిఎం వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీత, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖెందర్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సి గోరేటి వెంకన్న, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, భువనగిరి జోన్ డిసిపి కె.నారాయణరెడ్డి, సిఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపిటిసి పలుగుల నవీన్, కవులు, రచయితలు మిట్టపల్లి సురెందర్, సాయిచంద్, అంబటి వెంకన్న అభినయ్ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస్, బూర సతీష్, మానుకోట ప్రసాద్, బాబు, శివ, బిక్షపతి, తదితరులు ఉన్నారు.
దళితబంధు తెలుసా..!
గ్రామంలోని దళితవాడల్లో సిఎం కెసిఆర్ సుమారు 3 గంటల పాటు పర్యటించారు. సుమారు 60 ఇండ్ల వద్దకు కాలినడకన వెళ్లి వారి యోగక్షేమాలు, కుటుంబ ఆర్ధిక పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దలిత వాడల్లో పర్యటించిన సిఎం ఇండ్లు లేని వారికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకం గురించి తెలుసా అని పలువురిని అడిగి తెలుసుకున్నారు. “ఇంటికి పది లక్షలు ఇస్తే ఏం చేస్తారు..? దళితబంధు డబ్బలు వస్తే ఎం చేద్దామనుకుంటున్నారని’ సిఎం దళితులతో చర్చించారు. కొంత మంది మిల్క్ డైరీ, మరికొందరు ట్రాక్టర్‌లు కొంటామని, ఇంకొందరు వ్యాపారాలు చేసుకుంటామని సిఎంకు వివరించారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి పేరు పేరునా పలకరిస్తూ మీకు పెన్షన్ వస్తుందా..? పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా ఉన్నారా…? అని ఆరా తీస్తూనే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని అక్కడే ఆదేశించారు. దళిత వాడల్లో కూలిపోయే స్థితిలో మట్టి గోడలతో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలోకి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బందు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు. కాగా ఇతర కాలనీల్లో పర్యటించు సమయంలో ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను సీఎం జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు నీటిలో మునిగితున్నాయని పలువురు సిఎంకు మొర పెట్టుకున్నారు. కాలనీల రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాలు చెప్పబోతుండగా.. “నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా” అని సీఎం వాఖ్యానించారు. ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎంకు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడని చెప్పడంతో దళితబంధు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా..? దళిత నాయకుడు “ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల” అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా..? రైతు బందు డబ్బులు వస్తున్నయా ? ఏయే పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గర వెళ్ళీ పెన్షన్ లో కొంత ఏమైనా పక్కకు పోదుపు చేసుకుంటున్నరా అని ఆరా తీసారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగావున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా చూడటమే తన లక్ష్యమన్నారు.
నేడు.. 76 కుటుంబాల ఖాతాల్లోకి రూ. 10 లక్షలు
RELATED ARTICLES