సభకు హైకోర్టు అనుమతి
మద్దతు ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా, ఉద్యోగ సంఘాలు
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని జెఎసి నేతల విజ్ఞప్తి
హైదరాబాద్ / సిటీబ్యూరో : ఆర్‌టిసి కార్మికుల సమ్మెలో భాగంగా జెఎసి ‘సకల జనుల సమరభేరి’ సభను బుధవారం మధ్యాహ్నం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనుంది. ఆర్‌టిసి జెఎసి తలపెట్టిన ఈ సభకు ఇప్పటికే అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతునిచ్చాయి. సభకు భారీ ఎత్తున ఆర్‌టిసి కార్మికులు, ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, శ్రేణులు తరలివచ్చే అవకాశముంది. సభకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో జెఎ సి హైకోర్టును ఆశ్రయించగా సభను మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంట ల వరకు నిర్వహించుకునేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తీసుకురావాలని జెఎసి కన్వీనర్ ఇ.అశ్వద్ధామరెడ్డి, కోకన్వీనర్లు కె.రాజిరెడ్డి, వి.ఎస్.రావు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 బస్ డిపోల నుంచి కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, ఇతర కార్మికులు సభకు హాజరయ్యేలా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. తమకుటుంబ సభ్యులను కూడా సభకు వెంట తీసుకురావాలని ఇప్పటికే కార్మికులకు నేతలు కోరారు. ఈ సభను సక్సెస్ చేసి తమ సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సకల జనుల సమరభేరి సభకు టిఆర్‌ఎస్ మినహా సిపిఐ, సిపిఐ(ఎం), కాంగ్రెస్, టిడిపి, బిజెపి, టిజెఎస్ ఇతర రాజకీయ పక్షాలన్నీ పూర్తి మద్దతును ప్రకటించాయి. మరోవైపు ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాలు సైతం బుధవారం జరిగే సభకు తమ మద్దతును ప్రకటించడమే కాకుండా సభలో పాల్గొంటామని ప్రకటించాయి. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సభకు హాజరుకానున్నట్లు సమాచారం. సభకు హజరయ్యే కార్మికులు, ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను జెఎసి నేతలు చేశారు. సభా వేదిక నుంచి కార్మికులను ఉద్దేశించి జెఎసి నేతలు మాట్లాడనున్నారు. కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో ఆత్మస్థుర్యైం నింపడంతో పాటు మరింత పట్టుదలతో సమ్మెను కొనసాగించే విధంగా సభను నిర్వహించాలని జెఎసి నేతలు భావిస్తున్నారు. ఆర్‌టిసిని పరిరక్షించడం, తమ డిమాండ్ల సాధనకు ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలనే భవిష్యత్ కార్యచరణను సభా వేదిక నుంచి జెఎసి నేతలు ప్రకటించనున్నారు. ఒకవైపు సమ్మె విషయంలో ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడం, మరోవైపు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ కార్మికులు వెనక్కు తగ్గకపోవడం 25 రోజులుగా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. కోర్టులో ఇరువర్గాల మధ్య ఇప్పటికే వాడివేడి వాదనలు పలు దఫాలుగా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అరకొరగా నడుస్తున్న బస్సులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న ఆర్‌టిసి కార్మికులు తలపెట్టిన సకల జనుల సమరభేరి సభ వైపు రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
నేడు సకల జనుల సమరభేరి
RELATED ARTICLES