వారంలో 6 రోజులూ సెలవు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీ నం చేయడంను నిరసిస్తూ, తమ వేతనాల సమీక్ష వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల యూనియన్ శుక్రవారం సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ పిలుపును అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య ఇచ్చింది. కాగా ఈ సమ్మెలో పాల్గొనబోని ప్రయివేట్ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. సమ్మె గురించి ఇప్పటికే అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు ముందుగానే తెలిపాయి. తొమ్మిది బ్యాంకుల యూనియన్‌లకు ఛాత్ర సంస్థలా ఉన్న ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బియు) కూడా డిసెంబర్ 26న సమ్మె పాటించాలని నిర్ణయించింది. బ్యాంకు యూనియన్ల ఈ రెండు సమ్మె రోజులను పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు ఈ శుక్రవారం నుంచి వచ్చే బుధవారం వరకు ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వ బ్యాంకులు పనిచేయనున్నాయి. డిసెంబర్ 26 వరకు మూడు సెలవు దినాలున్నాయి. డిసెంబర్ 22న నాలుగో శనివారం, తర్వాత ఆదివారం, ఆ తర్వాత మంగళవారం క్రిస్టమస్ పండుగ ఉన్నాయి. ‘లాభాలు లేక చెల్లించే సామర్థ్యంతో ముడిపెట్టకుండా కనీస వేతనం ఫార్ములా కింద వేతన సమీక్ష జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని ఎఐబిఒసి జాయింట్ జనరల్ సెక్రటరీ రవీందర్ గుప్తా చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ప్రతిపాదిత విలీనాన్ని కూడా బ్యాంకు అధికారుల యూనియన్ వ్యతిరేకిస్తోంది.