స్వయంగా ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఈటల రాజేందర్
భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన స్పీకర్
ప్రజాపక్షం/ హైదరాబాద్: శాసనభ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. శాసనసభ, మండలిలో ఉదయం 11:30 గంటలకు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ (తాత్కాలిక బడ్జెట్)ను ప్రవేశపెట్టనుంది. కాగా శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్, మండలిలలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ ప్రస్తుతం సిఎం కెసిఆర్ వద్దనే ఉండడంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి సిఎం హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో 2010- ఆర్థిక సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 23న బడ్జెట్‌పై శాసనసభ, శాసనమండలిలో చర్చ ప్రారంభమవుతోంది. శాసససభ, మండలి సమావేశాల నిర్వహణకు అవసరమైన భద్రత ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పోలీసు, ఉన్నతాధికారులు సమీక్షించారు. పోచారం మాట్లాడుతూ శాసనభ సమావేశాలు ఈనెల 22 నుంచి 25 వరకు జరగనున్నాయన్నారు. మూడు రోజుల పాటు సభ సమావేశమవుతుందని, అందరి సహకారంతో సమావేశాలు జరుగుతాయన్నారు.