కేంద్రంలో మోడీ, విజయవాడలో జగన్
న్యూఢిల్లీ/ విజయవాడ : భారీ మెజారిటీతో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో రెండోసారి ప్రధానిగా నరేంద్రమోడీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాత్రి 7 గంటలకు నరేంద్రమోడీచేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించనున్నా రు. ఇదే సమయంలో మోడీ మంత్రివర్గం కూడా కొలువుదీరనుంది. ఇప్పటికే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా స్వదేశంలోని సిఎంలు, గవర్నర్లు, ఇతర ప్రముఖులకే కాకుండా బిమ్‌స్టెక్ దేశాల అధిపతులకు ఆహ్వానాలు వెళ్లాయి. బిమ్‌స్టెక్ నేతలు ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానుండటం ఇదే తొలిసారి. ‘బిమ్‌స్టెక్’ కూటమిలో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు కలిసి బంగాళాఖాత బహుళరంగ సాంకేతిక, ఆర్థిక సహకార ప్రారంభం (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీసెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్-బిమ్‌స్టెక్)గా ఏర్పాటయ్యాయి. గతసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ‘సార్క్’ దేశాల కూటమిని ఆహ్వానించడం గమనార్హం. సార్క్ కూటమిలో పాకిస్థాన్‌కు సభ్యత్వం ఉండగా, బిమ్‌స్టెక్‌లో లేదు. 2014లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించగా, ఈసారి ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆహ్వానం పంపలేదు. అదే విధంగా ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బిజెపి కార్యకర్తల కుటుంబసభ్యులను కూడా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇలా దివంగత కార్యకర్తల బంధువులను ఆహ్వానించడం కూడా ఇదే తొలిసారి. ఈ సారి ప్రమాణస్వీకారోత్సవానికి అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది. దాదాపు 6500 మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. 2014లో మోడీ తొలిసారిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు అతిథుల సంఖ్య ఐదు వేల వరకు మాత్రమే ఉంది.
విజయవాడలో ఎపి సిఎంగా నేడు జగన్ ప్రమాణం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సిపి ద్వరకా తిరుమలరావు తెలిపారు. స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. గ్రౌండ్‌లో 12వేల మంది, గ్యాలరీలో 18వేల మంది కూర్చునేందుకు వీలుందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి 12 వేల పాసులు జారీ చేస్తున్నామని, సాధారణ ప్రజలను గ్యాలరీలోకి అనుమతిస్తామని సిపి వెల్లడించారు. స్టేడియం సమీపంలో 10వేల మంది వరకు వీక్షించేందుకు అనువుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను శివారు మీదుగా మళ్లిస్తామని, ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని వివరించారు. నగరంలో స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను ఇతరమార్గాల్లో మళ్లిస్తామని చెప్పారు. పాసులు ఉన్నవారంతా ఉదయం 10.30గంటల లోపు స్టేడియంలోకి చేరుకోవాలని సూచించారు.
నేడు ప్రమాణం
RELATED ARTICLES