ప్రజాపక్షం/హైదరాబాద్; ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఈ సమావేశం లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం జరిగినప్పటికీ పూర్తిస్థాయి అంశాలపై చర్చ జరగలేదు. లోక్‌సభ, పరిషత్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జరుగుతున్న మొదటి కేబినెట్ కావడంతో దీనికి అత్యంత ప్రధాన్యత సంతరించుకుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఐ.ఆర్, సిపిఎస్ విధానం రద్దు, ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం, పోలీసులకు వారంతపు సెలవులు వంటి నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఉంటాయా..? ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్, ఉద్యోగ పదవి విరమణ వయసు, సిపిఎస్ విధానం అంశంపై నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఉద్యోగ వర్గాలు కూడా ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భవనాలను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసిన నేపథ్యంలో కొత్త సచివాలయ ఏర్పాటు, మున్సిపల్ కొత్త చట్టం, నీటిపారుదల ప్రాజెక్ట్ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయంశంగా మారిన నేపథ్యంలో కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అనేది సర్వత్రా చర్చనీయంశంగా మారింది.