ప్రజాపక్షం / కాళేశ్వరం ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపెల్లి లక్ష్మీ పంప్‌హౌస్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు సిఎంఒ కార్యాలయం నుండి సిఎం కెసిఆర్ పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. సిఎం కెసిఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ నుండి ఉదయం పది గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కన్నెపెల్లి పంప్ హౌస్ హెలిప్యాడ్ చేరుకొని, అక్కడ నుండి ప్రత్యేక వాహనంలో 11 గంటలకు నేరుగా కాళేశ్వరం చేరుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 11:50: గంటలకు మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్ చేరుకుని అక్కడ భోజనం అనంతరం గోదావరి జలాల బ్యాక్ వాటర్‌ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతలకు సంబంధించిన అనేక విషయాలను ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో చర్చించి వారికి దిశా నిర్దేశం చేస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సిఎ కాళేశ్వరం పర్యటన ఖరారు కావడంతో ఒక వైపు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నం కాగా,మరోవైపు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నేడు కాళేశ్వరం పర్యటనకు సిఎం కెసిఆర్
RELATED ARTICLES