జల వివాదాలతో పాటు విభజన సమస్యలపై చర్చ
ప్రజాపక్షం/హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావ్‌లు సమావేశమవుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అత్యంత ప్రధానమైన జలవివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో ఇరువురి మద్య చర్చలు జరగుతాయి. వీటితో పాటు విభజన సమస్యలు, ఇతరత్ర వాటిపై కూడా ఇరువురు చర్చిస్తారు. నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఇటీవలే సిఎం కెసిఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారాలపై ఒక పుస్తకం రూపొందించి అందచేశారు. ఇందులో ఉన్న పరిష్కార మార్గాలను ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి పరిశీలిస్తారని సమాచారం. వీటిలో ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న జలవివాదాలకు ఏవేని పరిష్కార మార్గాలు ఉంటే వాటిని ఎంచుకోవడం లేదా ఇరువురికి ఆమోదయోగ్యమైన ఇతర మార్గాలను ఎంచుకోవడం జరగవచ్చని సమాచారం. ప్రధానం శ్రీశైలం, నాగార్జున సాగర్ జల వివాదాలు ఇందులో ప్రధానం కానున్నాయి. అంతే కాక కృష్ణా జలాల వాటాలపై కూడా ప్రధాన చర్చ జరగనుంది.