ప్రజాపక్షం/ హైదరాబాద్/ ఆదిలాబాద్ ప్రతినిధి : టిఆర్‌ఎస్ ఏడున్నరేళ్ల పాలనలో దళిత – గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు టిపిసిసి భారీ బహిరంగ సభను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రవెల్లిలో నిర్వహించనుంది. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవమరాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్, టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క, మంథని ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మహేశ్వర రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పపాల్గొననున్నారు. కాంగ్రెస్ స్థానిక నేతలు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గుడిహత్నుర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీగా ఇంద్రవెల్లి సభకు బయలు దేరి వెళ్తారని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.
సభను జయప్రదం చేయండి : రేవంత్
ఇంద్రవెల్లిలో సోమవారం చేపట్టనున్న ‘దళిత,గిరిజన ఆత్మగౌరవ సభ’ను జయప్రదం చేయాలని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆదివాసి, గిరిజనులందరూ హాజరవ్వాలని కోరారు. బంజారాహిల్స్‌లోని ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి ఆదివారం వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే సిఎం కెసిఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రం మొత్తంలో ఉప ఎన్నికలు తీసుకురావాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రతీ దళిత, గిరిజన రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మరో నాలుగైదు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డిఅడిగినట్టు వివరించారు. లక్షకు పైగా కాంగ్రెస్ శ్రేణులతో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేస్తామని తెలిపారు. రేపటి సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు.
నేడు ఇంద్రవెల్లిలో టిపిసిసి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ
RELATED ARTICLES