కుమ్రంభీమ్ జిల్లా జోడేఘాట్‌లోని కుమ్రంభీమ్ స్థూపం నుంచి ప్రారంభం
ప్రజాపక్షం / హైదరాబాద్ అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల దౌర్జన్యాల కు గురవుతున్న పోడు సాగుదారులకు అండ గా నిలిచేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ‘పోడు యాత్ర’ను కుమ్రంభీమ్ జిల్లా జోడేఘాట్‌లో ని కుమ్రం భీమ్ స్థూపం నుండి బుధవారం ప్రారంభించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 8వ తేదీ వరకు సాగే ఈ యాత్ర భద్రాచలంలో ముగియనుందని మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. చాడ వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సాగే పోడు యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్, ప్రజాసంఘాల నాయకులు కలకొండ కాంత య్య, రమావత్ అంజయ్యనాయక్, పల్లె నర్సింహా, కె.శ్రీనివాస్, కె.ఉప్పలయ్య, కన్నం లక్ష్మినారాయణ పాల్గొంటారు. పోడు రైతులపై పోలీసులు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు హద్దుల పేరుతో లోతైన కందకాలు తవ్వించి సాగుకు నిరుపయోగంగా మార్చి చేతికి వచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా పోడు సాగు రైతులు, ఆదివాసీ గిరిజన బిడ్డలకు సిపిఐ అండగా నిలబడిందని, సిపిఐ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన ఘనత ఈ నిరంకుశ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రభుత్వం పోడు రైతులపై సాగిస్తున్న అణచివేతతో గిరిజనులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, ఈ ఆపద సమయంలో రైతులకు అండగా నిలుస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సిపిఐ నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి పోడు రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, పోడు రైతులపై పోలీసులు, ఫారెస్ట్ అధికారుల దాడులను వెంటనే ఆపాలని, పోడు రైతులపై, కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతులకు వడ్డీలేని రుణాలను బ్యాంకుల నుండి బేషరతుగా ఇప్పించాలని, రైతుబంధు, రైతు బీమా అందరికీ వర్తింపచేయాలని, వ్యవసాయ శాఖ, గిరిజన శాఖ సమన్వయంతో పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని కొమురంభీం జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ఈ యాత్రసాగుతోందని చాడ వెంకటరెడ్డి తెలిపారు.
నేటి నుంచి సిపిఐ ‘పోడు’ యాత్ర
RELATED ARTICLES