అన్ని పిహెచ్‌సిల్లో అందుబాటులో…
హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లు, పెద్ద బస్టాండ్లలో 24 గంటల పాటు వ్యాక్సిన్
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్ర వ్యాపితంగా శుక్రవారం నుంచి 18 ఏళ్లు పైబడి, రెండో డోసు తీసుకుని ఆరు నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ‘బూస్టర్ డోస్’ ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 75 రోజుల పాటు జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వడంతో ప్రజలను కరోనా నుంచి కాపాడుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం, ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు అసుపత్రులకు మాత్రమే అనుమతించింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది బూస్టర్‌డోస్‌ను తీసుకోలేకపోయారు. మరోవైపు కొత్త వేరియంట్ రూపంలో కరోనా కేసులు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు డోసులను పూర్తి చేసుకున్న అర్హులైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగానే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గత ఏడాది డిసెంబర్ 2, ఈ ఏడాది జనవరి 18, ఏప్రిల్ 11న మొత్తం మూడు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జూన్ 13న అన్ని రాష్ట్రాల అరోగ్య శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు మరోమారు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం, ప్రభుత్వ దవాఖానల ద్వారా ప్రజలకు ఉచితంగా బూస్డర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించింది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్: మంత్రి హరీశ్‌రావు
ప్రపంచ కొవిడ్ పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ పంపిణీకి అనుమతించాలని, ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమని కేంద్రానికి వివరించిన విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్ర తన్నీరు హరీశ్‌రావు గుర్తు చేశారు ఆలస్యమైనా ఇప్పటికైనా కేంద్రం అనుమతి ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశానికి మేలు చేస్తుందని, రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కలిపి మొత్తం 20 లక్షల డోసుల నిల్వ ఉన్నదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ అందేలా ఏర్పాట్లు చేయలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
అందుబాటులో ‘బూస్టర్ డోస్’
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుంది. అన్ని జూనియర్, డిగ్రీ,ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు యూనివర్సిటీల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులో పెట్టనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లతో పాటు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టాండ్‌లలో 24 గంటల పాటు వ్యాక్సిన్ సౌకర్యం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హౌసింగ్ సొసైటీలు, ఆఫీసులు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇతర వర్క్ ప్లేసెస్ లో వారి విజ్ఞప్తి మేరకు వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. కాగా వంద మంది కంటే ఎక్కువ లబ్ధిదారులు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి “ 040-24651119”ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నేటి నుంచి రాష్ట్రంలో ఉచితంగా బూస్టర్‌డోస్
RELATED ARTICLES