వెలుగు చూసిన మరో మల్టీలెవల్ మార్కెటింగ్
గొలుసుకట్టు మోసాల జాబితాలోకి గ్రీన్‌గోల్డ్
ప్రజాపక్షం/ సిటీబ్యూరో : నగరంలో మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగు చూసింది. కరక్కాయల పొడి మోసం తరహాలోనే వేరుశనగ గింజల నుండి నూనెతీసే యంత్రాలు ఇస్తామని గ్రీన్‌గోల్డ్ బయోటెక్ అనే సంస్థ వంద కోట్ల కు పైగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా బాధితులు ఉన్నట్లు తెలిసింది. కొత్తపేటకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకుడు జిన్నా శ్రీకాంత్‌ను మంగళవారమే ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన జిన్నా శ్రీకాంత్ ఉప్పల్ మెట్రోస్టేషన్ సమీపంలో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో ఈ గొలుసు కట్టు వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. గతంలో మహాలైఫ్ పేరుతో కూడా అమాయకుల నుండి శ్రీకాంత్ కోట్లు కొల్లగొట్టిన్నట్లు బాధితులు చెబుతున్నారు. గ్రీన్‌గోల్డ్ సంస్థలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 10వేల రూపాయల ఆదాయం అందిస్తానని అమాయకులను నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేందుకు సిద్ధంగా ఉండటంతో పలువురు బాధితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంత మంది బాధితుల నుండి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు..? ఇంకా ఎంత మందికి ఈ వ్యాపారంతో సంబందం ఉంది..? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.