ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దాం
జగన్‌కు సిఎం కెసిఆర్ హామీ
బెజవాడకు రండి
సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు
ప్రగతిభవన్‌లో ఇరునేతల సుదీర్ఘ్ఘ భేటీ
జగన్‌కు కెసిఆర్, కెటిఆర్, రాష్ట్రమంత్రుల సాదర స్వాగతం
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి ప్రగతిభవన్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఘన స్వాగతం పలికారు. జగన్‌ను ఆలింగనం చేసుకున్నారు. పోచంపల్లి ఇక్కత్ శాలువాకప్పి సన్మానించారు. కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపిక బహుకరించారు. సిఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని జగన్‌ను దీవించారు. స్వీటు తినిపించి సంతోషం పంచుకున్నారు. రాష్ట్ర మం త్రులను, ఇతర ప్రముఖులను జగన్‌కు పరిచ యం చేశారు. జగన్ భార్యకు కెసిఆర్ సతీమణి శోభారాణి, కెటిఆర్ సతీమణి శైలిమ స్వాగతం పలికారు. జగన్ వెంట ఆంధ్రప్రదేశ్ ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కెసిర్, జగన్‌లు కొంతసేపు రాష్ట్ర సమస్యలపై భేటీ అయ్యారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సిఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైఎస్‌ఆర్‌సిపి ఎల్‌పి నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సిఎం కెసిఆర్ స్నేహహస్తం అందించారు. “ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాము. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పాను. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం” అని జగన్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. “గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టిఎంసిలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు” అని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. కాగా, కెసిఆర్‌తో పాటు జగన్‌కు స్వాగతం తెలిపిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటెల రాజెందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు, ఎంపి జె. సంతోష్ కుమార్, మాజీ ఎంపిలు బి.వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి తదితరులున్నారు. ఈ నెల 30న విజయవాడలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి తప్పక రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ ఆహ్వానించారు.
నీళ్లు పంచుకుందాం
RELATED ARTICLES