చిన్నారులపై ఫార్మా కంపెనీల కొత్త మందులు, వ్యాక్సిన్‌ల ప్రయోగం
విచారణకు ఆదేశించిన డిఎంఇ
వివరణ కోరిన కేంద్ర హోంశాఖ
అన్ని అనుమతులతోనే నిర్వహిస్తున్నాం: డాక్టర్ రవికుమార్
ప్రజాపక్షం/సిటీబ్యూరో: నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులపై వైద్యులు క్లినికల్ ట్రయల్స్‌కు పాల్పడటం హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. ఫార్మా కంపెనీల కొత్త మందులు, వ్యాక్సిన్‌లను నీలోఫర్ వైద్యులు చిన్నారులపై ప్రయోగిస్తున్నట్లు, ఇందుకోసం రెండు ఫార్మా కంపెనీల నుంచి వైద్యులకు భారీగా నజరానాలు అందుతున్నాయన్న విమర్శలు దుమారం రేపుతున్నాయి. ఈ ట్రయల్స్‌కు పాల్పడుతుండటంపై చిన్నారుల కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఫార్మా కంపెనీలు తయారు చేసిన మందుల పనితీరుతో పాటు నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు ఈ ట్రయల్స్ చేస్తుంటారు. అయితే ఈ ప్రయోగం నిర్వహించే సమయంలో అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రయోగం చేసిన ఉన్నతాధికారి తాను అన్ని అనుమతులు తీసుకొని ట్రయల్స్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ, సూపరింటెండెంట్ అనుమతితో పాటు 12మందితో కూడిన ఎథికల్ కమిటీ సభ్యులు నెలరోజుల పాటు స్టడీ చేసిన అసుమతితో పాటు ట్రయల్స్ ప్రయోగించే వారి కుటుంబ సభ్యులకు ముందుగానే తెలిపి వారికి తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా సూచించి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ట్రయల్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? లేదా? అనే దానిపై వైద్యవిద్య సంచాలకులు(డిఎంఇ) డాక్టర్ రమేష్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు ఎక్స్‌పర్ట్‌లతో కూడిన ఓ కమిటీని నియమించారు. ఇప్పటి వరకు వైద్యులు చూసిన చిన్నారుల కే షీట్‌లతో పాటు వైద్యసేవలు అందించిన వివరాలను సమర్పించాలని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను ఆదేశించారు. విచారించిన అనంతరం వాస్తవాలు తేల్చనున్నారు.
నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులపై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో కేంద్ర హోంశాఖ కార్యాలయం స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరణ సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదేశించారు.
నీలోఫర్‌లో మందుల ప్రయోగాలు గత 7, 8 ఏళ్లుగా జరుగుతున్నాయని నీలోఫర్ పిడియాట్రిక్ హెచ్‌ఒడి డాక్టర్ రవికుమార్ అన్నారు.