ఎపికి వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాయని, తెలంగాణ వాటాలపై ఎపి దాదాగిరి చెల్లదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. జోగుళాంబ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు అడ్డొస్తారో చూస్తామన్నారు. జోగుళాంబ బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణకు అన్ని హక్కులు, అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తాము అణుకువగా ఉంటే, ఏ హక్కూ లేని ఎపి ప్రభుత్వం ఎగిరెగిరి పడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న అక్రమ ప్రా జెక్ట్‌లపై అసలు కేంద్రం వైఖరి ఏమిటని, వాటర్ బోర్డు మేనేజ్ మెంట్ ఏం చేస్తుందని, ఆరోపణ లు, వార్తలను కృష్ణా బోర్డు సుమొటోగా ఎందు కు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో ఉన్న తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపి రాములు, ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు,జైపాల్ యాదవ్, అబ్రహం, ఎంఎల్‌సిలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి,కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఎపి ప్రభుత్వం మానవీయకోణాన్ని ముందుపెట్టి, తాగునీటి పేరుతో సాగునీటి దోపిడీ మొదలుపెట్టిందని ఆరోపించారు. ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు, తెలంగాణ సక్రమ ప్రాజెక్టులకు పొంతనే లేదని, దబాయింపు మాటలు ఇప్పుడు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు తెలంగాణకు జలవనరులలో అన్యాయం జరిగేందుకు అప్పటి ఆంధ్రా ప్రాంత పాలకుల దుర్బుద్ది, తెలంగాణ ప్రాంతంలో ఉన్న బానిస మనస్తత్వం కలిగిన ఇంటి దొంగల వైఖరే ప్రధాన కారణమని తెలిపారు. రాష్ట్రాలు కొట్లాడుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ వైఖరిగా ఉన్నట్టు అనుమానం కలుగుతుందని, ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం చేయూతనివ్వకపోగా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకే కృష్ణానదిపై నీటివాటాలో హక్కులు ఉన్నాయన్నారు. కృష్ణానదిలో నీటివాటాలు తేల్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో స్వయంగా కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు ప్రధామంత్రి, ప్రస్తుత కేంద్ర జల్ శక్తి మంత్రిని అనేక సార్లు కోరినా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గర్హనీయమని, రాష్ట్రాలకు దారి చూపాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుందన్నారు. కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణ పనులను చేపడుతామని స్వయంగా ఆంధ్ర ప్రభుత్వమే గ్రీన్ ట్రిబ్యునల్ అండర్ టేకింగ్ ఇచ్చిందని, ఇప్పుడు వారు చెప్పిన దానినే వారు తుంగలో తొక్కి యథావిధిగా పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ప్రాజెక్టులు, జల అంశాలపైనే కాంగ్రెస్‌తో విభేదించి నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టిఆర్‌ఎస్ బయటకు వచ్చిందన్నారు. టిఆర్‌ఎస్‌ను, కెసిఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు విమర్శిస్తున్న నేతలంతా అప్పట్లో జలదోపిడీకి కావడిమోసిన వాళ్లేనని ఎద్దేవా చేశారు. ఒక మాజీ మంత్రి హారతులు పడితే, ఇంకో మాజీమంత్రి పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా వ్యాసాలు రాశారని, ఇంకో మాజీ మంత్రి రాజశేఖర్‌రెడ్డి వంటి వారు మా ప్రాంతంలో పుట్టలేదే అని అన్నారని గుర్తు చేశారు. కృష్ణానదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమే అని, తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రాతిపదికనే ఒక కుట్ర అని, ఆ కుట్రలో ప్రధాన అంశం సాగు నీటి వనరుల దోపిడీ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
నీటి వాటాపై దాదాగిరి చెల్లదు
RELATED ARTICLES