HomeNewsBreaking Newsనీటి గుంతలోపడి ముగ్గురు చిన్నారులు మృతి

నీటి గుంతలోపడి ముగ్గురు చిన్నారులు మృతి

షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విషాదం
ప్రజాపక్షం/షాద్‌నగర్‌
ముక్కుపచ్చలారని చిన్నారులను మృత్యువు నీటి రూపంలో కబళించిన ఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని సోలీపూర్‌ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఫరీద్‌ (13), ఫారిన్‌ (7), అక్షిత్‌ గౌడ్‌ (7) సమీపంలో ఉన్న నీటి గుంత వద్దకు చేపలు పట్టేందుకు వెళ్ళారు. మొదటగా ఫరీద్‌ నీటిలోకి వెళ్లగా తరువాత ఫారిన్‌ వెళ్ళాడు. గుంత లోతుగా ఉండగా ఈత రాకపోవడంతో మునుగుతున్న క్రమంలో అక్షిత్‌ గౌడ్‌ వెళ్లి వారిని రక్షించేందుకు యత్నించగా ముగ్గురు నీటిలో మునిగిపోయారు. నీటి గుంత ఒడ్డున ఉన్న మరో చిన్నారి నీటిలోకి దిగి వారందరిని రక్షిద్దామన్న యత్నం చేసినప్పటికీ గుంత లోతుగా ఉందని భావించి హుటాహుటిన సోలీపూర్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. దాంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకునే లోగా ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను బయటకు తీగానే మృతుల కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ క్షసిపి కుషాల్కర్‌, ఫరూఖ్‌నగర్‌ తహసీల్దార్‌ గోపాల్‌, మున్నిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, కౌన్సిలర్‌ లతశ్రీ శ్రీశైలం గౌడ్‌ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈత రాకపోవడం వల్లే మృత్యువాత : ఎసిపి
ముగ్గురు చిన్నారులకు ఈత రాకపోవడం వల్లనే మృత్యువాత పడ్డారని షాద్‌నగర్‌ ఎసిపి కుషాల్కర్‌ వివరించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన అనంతరం వివరాలు తెలిపారు. గ్రామ సమీపంలో ఉన్న వెంచర్‌లో అక్రమంగా మట్టిని తీయడం వల్లనే వర్షపునీరు చేరి ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైందని తెలిపారు. మృతదేహాలను షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, విచారణ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి నివేదిక పంపించి మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేయనున్నట్లు వివరించారు. ఇదే క్రమంలో షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో ధర్నా చేసేందుకు యత్నించగా పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని లాఠీలతో ఆందోళన కారులను చేదరగొట్టారు. ఇదిలా ఉండగా, నీటి గుంతలో పడి మృతి చెందిన చిన్నారు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments