అప్పు చేసి పప్పుకూడు పెట్టడం లేదు
అప్పులు తెచ్చినా.. తీర్చినా… అది ప్రభుత్వ వ్యూహమే
ప్రతిపక్షానిది అనవసర రాద్ధాంతం
రిజర్వేషన్లు తెచ్చిందే ఎన్‌టిఆర్.. కాంగ్రెస్‌లో అంతా దొరలే…
వారి హయాంలో కాగితాలపైనే ప్రాజెక్టులు
శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్: అప్పు చేసి పప్పుకూడు పెట్టడం లేదని, భవిష్యత్ తరాల బంగారం కోసం, నీటి కోసం అప్పులు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో అప్పులు 25 శాతం వరకు ఉండొచ్చని, మనం 21.5 శాతం వరకు అప్పులు చేశామన్నారు. అప్పులు ఎలా తీసుకోవాలనేది ప్రభుత్వ వ్యూహమని, కార్పొరేషనా..? ప్రభుత్వమా..? ఇలా ఎక్క డి నుంచి అప్పులు తీసుకుంటే మీకు (కాంగ్రెస్) ఉన్న అభ్యంతరాలేమిటని ప్రశ్నించారు. వివరించారు. శాసనసభలో సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు కెసిఆర్ జవాబిచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా బడ్జెట్ అంచనాలు పెంచి ప్రతిపాదనలు చూపుతారని, ఆ తర్వాతే వాస్తవాలకు అనుగుణంగా సవరణ ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో రూ.1,25,000 కోట్ల విలువజేసే పంటలు ఉత్పతి కాబోతున్నాయని, తద్వారా రాష్ట్రంలో జిఎస్‌టి, పన్నులు పెరుగుతాయని, తా ము చేస్తున్న అప్పులు సంవత్సరం పండించిన పంట విలువ కాదని వివరించారు. ఎర్రజొన్నల ధర విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అంత హీనమైన ధరలేమి లేవని, కాని కాంగ్రెస్ నాయకులే కావాలని రైతులతో ధర్నాలు చేపిస్తున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర ల ఆందోళన లేకుండా చేపట్టి, కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ధర్నాలు చేసుకునే అవకాశాన్ని కల్పించబోమని కెసిఆర్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న లోయర్‌పెన్ గంగా ప్రాజెక్ట్‌ను నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు నీటిని సరఫరా చేస్తామన్నారు. రాష్ట్ర పరిపాలనలో పెనుమార్పులు చూడబోతున్నారని,తమ ప్రభుత్వ టర్మ్ ముగిసే సరికి తన వయసు 71కి చేరుతుందని, ఈ వయసులో తాను ఎవ్వరితోనూ భయపడాల్సిన పనిలేదని, కొన్ని అంశాల్లో తాను కఠినంగా వ్యవహారిస్తానని తెలిపారు. రాజీపడకుండా ప్రజల కాంక్ష కు అనుగుణంగా నిర్మాణాత్మకంగా పనిచేస్తామన్నారు .ప్రజలకు మెరుగైన సేవను అందించడం,పారదర్శక పాలన అందించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. గతంలో తమకు వ్యతిరేకంగా యాత్రలు నిర్వహించారని, అనేక ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేశారని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని ఇలా అనేక విమర్శలు చేసినప్పటికీ ప్రజలు మాత్రం తమదే కరెక్ట్ అని, వారిది తప్పు అని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా మీరు (కాంగ్రెస్) మారకుండా అవగాహన లేకుండా మాట్లాడితే మీరు అంతకే ఉంటారని, తాము ఇలాగే ఉంటామని తెలిపారు. విద్యా రంగానికి ప్రభుత్వం 11.2 శాతం, ఎస్‌సి,ఎస్‌టి ఎక్కవగానే ప్రతిపాదించామని, 2017-18లో 16.45, 2018-19లో 15.07 శాతం ఖర్చు పెట్టామని, 2019- 15.71 శాతం నిధులను కేటాయించినట్లు వివరించారు. కాంగ్రెస్ వల్ల బిసిలకు రాజ్యాధికారం రాలేదని, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టిందే ఎన్‌టిఆర్ అని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్నదంతా గల్లీ, గద్వాల లాంటి దొరలేనని వ్యాఖ్యానించారు. దొరలంతా తమ కిరీటాలను వదిలి గాంధీ టోపీలను ధరించారని చెప్పారు. మొదట ఎన్‌టిఆర్ రిజర్వేషన్లను మొదలు పెట్టారని, రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేసిందన్నారు. కేంద్రంలో ప్రత్యేకంగా బిసి సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.