వందరోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రిమండలి విజ్ఞప్తి
బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన 16 కార్పొరేషన్లు ఏర్పాటు
అర్హులైనవారందరికీ త్వరలో రేషన్‌కార్డులు జారీ
రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం
ప్రజాపక్షం/హైదరాబాద్‌నీటి పారుదల, విద్యుత్ రంగాలలో జరిగిన అవకతవకలు, అవినీతిపైన రెండు వేర్వేరు ‘న్యాయ విచారణ కమిషన్’లను రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, అక్రమాలపై రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అధ్యక్షతన న్యాయ విచారణ కమిషన్, అలాగే భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్ట్, చత్తీస్‌ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన న్యాయ విచారణ కమిషన్ లను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రెండు న్యాయ విచారణ కమిషన్‌లను వంద రోజుల్లో సమగ్రంగా విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని కోరింది. బిసి, ఎస్‌సి,ఎస్‌టిలకు చెందిన మొత్తం 16 కార్పొరేషన్ల ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్‌కార్డులను జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం మంత్రివవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. 2008డిఎస్‌సి క్వాలిఫై అయిన అభ్యర్థులకు మినీమమ్ టైమ్ స్కేల్‌తో ఉద్యోగాలను కల్పించాలని నిర్ణయించింది.అభయ హస్తంలో భాగంగా మొదటి దశలో 4.5 లక్షల ‘ఇందిరమ్మ ఇండ్ల’ కింద ఆర్థిక సహాయంచేసేందుకు రూ. 22,500 కోట్ల నిధులను మంజూరు చేసింది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేందుకు వీలుగా హైదరాబాద్ లోని ఒఆర్‌ఆర్ చుట్టూ ఒకటి, రెండు
ప్రదేశాలలో 25 నుండి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీరి ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసేలా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని, తద్వారా వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయంగా పేరు వస్తుందని మంత్రివర్గం తెలిపింది.
‘త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాజకీయ పార్టీలకు అతీతంగా, పైరావీలకు తావు లేకుండా బహుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ. 22,500 కోట్ల నిధులకు మంత్రివర్గం ఆమోదించినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవారికి తెల్ల రేషన్ కార్డులను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతోనే ఒఆర్‌ఆర్ చుట్టూ 25 నుండి 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నామని, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో మహిళా సంఘాలు ఉత్పత్తులను బ్రాండింగ్ చేసేందుకు వసతులను కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 84 శాతం మందికి రైతుబంధు రైతు ఖాతాలలోజమ వేశామని, మరో రెండు రోజుల్లో 93 శాతానికి పైగా రైతుబంధు నిధులను ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.
వృత్తులకు సాంకేతికతను జోడిస్తాం: పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని హామీనిచ్చామని, ఇందులో భాగంగానే బలహీన వర్గాలను ఆర్థిక బలోపేతం చేస్తున్నామన్నారు. బిసి,ఎస్‌సి,ఎస్‌టి,ఆర్థికంగా వెనుకడిన వర్గాల నిమిత్తం 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేశామన్నారు. కుల గణన సర్వే పక్రియ కొనసాగుతోందన్నారు. కుల వృత్తులకు సాంకేతికతను జోడించి మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. తాటి చెట్లను ఎక్కే యంత్రంపై ముఖ్యమంత్రి సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసాక, నిర్ణయం తీసుకుంటామన్నారు.
సాగు,తాగు నీటి సమస్యను పరిష్కరించేలా కార్యాచరణ: శ్రీధర్‌బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సాగు,తాగు నీటి సమస్యలను పరిష్కరించేలా తగిన కార్యాచరణతో అధికారులు ముందుకు సాగాలన్నారు. వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లలో నీటి నీలువ లేదని, సాగు, తాగు సదుపాయాలకు ఇబ్బందుల రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్‌కార్డుల అంశంలో ఒక నివేదిక రూపొందించాలని పౌరసరఫరాల అధికారులను మంత్రివర్గం ఆదేశించిందన్నారు. మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తామని, ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత తీసుకొస్తామని, ఇందులో ప్రైవేటు వారిని కూడా భాగస్వాములను చేస్తామని తెలిపారు. వృత్తులకు సంబంధించిన కార్పొరేషన్లకు చెందిన విధి విధానాలను రూపొందించేందుకు ఆయా సంఘాలతో సంప్రదించాలని మంత్రివర్గం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సూచించిందన్నారు. వంద రోజులు పూర్తి కాకుండానే అనేక హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వాటిని అమలు చేశామన్నారు
బిఆర్‌ఎస్ ఖాళీ : కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ట్ ఖాళీ అవుతోందని,ఆ పార్టీకి చెందిన కింది స్థాయి క్యాడర్ పార్టీ వీడుతున్నారని, ఇప్పటికైనా కెసిఆర్ శాసనసభ సమావేశాలకు హాజరై మంచి సలహలు ఇవ్వాలని సూచించారు.పిచ్చివాగుడు వాగొద్దన్నారు. కెటిఆర్,హరీశ్, కెసిఆర్ తమ పదేళ్ల పాలనలో మహిళా సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎక్కడ లేని విధంగా వారికి అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి సిఎంను ఒక దళితుని చేస్తామని కెసిఆర్ హామీనిచ్చారని, ఇటువంటివి లక్షల సార్లు ఆయన అబద్దాలు చెప్పారని,అయినా తాము కెసిఆర్ విజ్ఞతకే వదలేశామని అన్నారు.