నిషేధించినా… ఫుడ్ డెలివరీలు చేస్తున్న స్విగ్గీ, జొమాటోలు
వాహనాలు సీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ సంస్థల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఫుడ్ డెలివరీలను చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝలిపించారు. వద్దన్నా… ఫుడ్ డెలివరీలను కొందరు చేస్తుండగా, నిబంధనలను ధిక్కరించిన వారిని పట్టుకునేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. డెలివరీ బాయ్స్ వాహనాలను వచ్చినవి వచ్చినట్టుగా సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిషేధం విధించినా, ఆర్డర్స్ తీసుకుంటున్న ఫుడ్ డెలివరీ యాప్స్‌పైనా కేసులు నమోదు చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు.