భారత్ రెండో ఇన్నింగ్స్ 151/3, ఆస్ట్రేలియా 235 ఆలౌట్, తొలి టెస్టు
ఆడిలైడ్: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాట్స్‌మన్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేయగా.. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాలో కెఎల్. రాహుల్ (44), విరాట్ కోహ్లీ (34), చతేశ్వర్ పుజారా (40 బ్యాటింగ్) పరుగులతో రాణించి మంచి ఆరంభాన్ని అందించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 151/3 పరుగులు చేసిన భారత్ 166 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆదివారం నాలుగో రోజు ఆటలో భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాపై పట్టు బిగించాలని టీమిండియా భావిస్తోంది.
శనివారం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు లోకేశ్ రాహుల్, మురళీ విజయ్ శుభారంభాన్ని అందించారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన ఈ జంట ఈసారి పుంజుకుంది. ఆరంభం నుంచే వీరు ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించారు. ఒకవైపు మురళీ విజయ్ సమన్వయంతో ఆడుతుంటే.. మరోవైపు రాహుల్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ భారత్‌కు గట్టి పునాది వేశారు. ఈ క్రమంలోనే టీమిండియా 14.3 ఓవర్లలో తొలి 50 పరుగులను పూర్తి చేసుకుంది. అయితే వీరు తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించిన అనంతరం ఆత్మరక్షణలో ఆడుతున్న మురళీ విజయ్ 53 బంతుల్లో 18 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పుజారా తనదైన శైలిలో కుదురుగా ఆడుతుంటే.. మరోవైపు రాహుల్ మాత్రం వేగంగా ఆడుతూ పరుగులు సాధించాడు. అవకాశం దొరికినప్పుడు చెత్త బంతులను బౌండరీలుగా మార్చుతూ పోయాడు. వేగంగా ఆడే క్రమంలోనే రాహుల్ తన కీలక వికెట్‌ను కోల్పోయాడు. హాఫ్ సెంచరీకి చెరువైన రాహుల్ (44; 67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 76 పరుగుల వద్దే రెండో వికెట్
అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారా భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తమపై వేసుకున్నారు. మరో వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయారు. కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లాగా దూకుడుగా ఆడకుండా సమనయంతో ఆడాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ హీరో పుజారా కూడా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే టీమిండియా 36.4 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. ఈ జంటను విడదీయడానికి ప్రత్యర్థి బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వీరిద్దరూ వారికి ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే వీరు మూడో వికెట్‌కు 149 బంతుల్లో 50 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే మూడో రోజు ఆట మరికొద్ది సేపట్లో ముగిస్తుందనగా భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. కుదురుగా ఆడుతున్న కెప్టెన్ కోహ్లీ (104 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు)ను ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్ 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. వీరు మూడో వికెట్‌కు కీలకమైన 71 పరుగులు జోడించి భారత్‌ను ఆదుకున్నారు. అనంతరం శనివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా (61 ఓవర్లలో) 151/3 పరుగులు చేసింది. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న పుజారా (127 బంతుల్లో 4 ఫోర్లతో 40) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతనికి తోడుగా అజింక్యా రహానే (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, నాథన్ లియాన్ తలొక్క వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు 191/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బుమ్రా ఎదురుదెబ్బ వేశాడు. కుదురుగా ఆడుతున్న మిచెల్ స్టార్క్ (34 బంతులో 15) వికెట్‌ను పడగొట్టి బుమ్రా తన ఖాతాలో మూడో వికెట్ వేసుకున్నాడు. దీంతో ఆసీస్ 204 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. తర్వాత నాథన్ లియాన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. లియాన్ దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు సాధించాడు. చివర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ (72; 167 బంతుల్లో 6 ఫోర్లు)ను మహ్మద్ షమీ పెవిలియన్‌కి చేర్చాడు. హెడ్‌ను ఔట్ చేసిన షమీ తన వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ వెంటనే హేజిల్‌వుడ్ (0)ను తొలి బంతికే ఔట్ చేసిన షమీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ముగించాడు. మరోవైపు దూకుడుగా ఆడిన లియాన్ (28 బంతుల్లో 24 పరుగులు) చేసి నాటౌట్‌గా నిలిచాడు కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 98.4 ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌కు వర్షం పదేపదే అంతరంయం కలిగించింది.
స్కోరుబోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 250 ఆలౌట్.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 235 ఆలౌట్.
భారత్ రెండో ఇన్నింగ్స్: కెఎల్. రాహుల్ (సి) టిమ్ పైన్ (బి) హేజిల్‌వుడ్ 44, మురుళీ విజయ్ (సి) హాండ్స్‌కొంబ్ (బి) మిచెల్ స్టార్క్ 18, చతేశ్వర్ పుజారా (బ్యాటింగ్) 40, విరాట్ కోహ్లీ (సి) అరోన్ ఫించ్ (బి) నాథన్ లియాన్ 34, అజింక్యా రహానే (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం (61 ఓవర్లలో) 151/3.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 10-3-18-1, హేజిల్‌వుడ్ 16-9-25-1, కమ్మిన్స్ 11-4-33-0, నాథన్ లియాన్ 22-3-48-1, హెడ్ 2-0-13-0.
………………………
ధోనీ రికార్డును సమం చేసిన పంత్
ఆడిలైడ్: భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు క్యాచ్‌లను పట్టి సంచలనం సృష్టించాడు. ఫలితంగా ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు అందుకున్న భారత వికెట్ కీపర్ల జాబీతాలో మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు. 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోనీ ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లను పట్టాడు. తాజాగా.. రిషభ్ పంత్ ఆ జాబీతాలో చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో హేజిల్‌వుడ్ క్యాచ్‌ను అందుకున్న పంత్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పంత్ వరుసగా ఉస్మాన్ ఖవాజా, హాండ్స్‌కొంబ్, ట్రావిస్ హెడ్, టిమ్ పైన్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ క్యాచ్‌లను అందుకున్నాడు.
………………..
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
ఆడిలైడ్: ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ల జాబీతాలో చేరాడు. ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ 8 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఉన్నప్పుడు ఆసీస్‌లో వెయ్యి పరుగులు చేసిన వారి క్లబ్‌లో చేరాడు. భారత్ తరఫున 1000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 9 మ్యాచుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్ 20 టెస్టుల్లో (1809) పరుగులతో ఈ జాబీతాలో మొదటి స్థానంలో ఉన్నాడు. వివిఎస్. లక్ష్మణ్ 15 టెస్టుల్లో (1236) పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. తర్వాత రాహుల్ ద్రవిడ్ 15 టెస్టుల్లో (1143) పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియాలో వెయ్యి పరుగులు చేసిన 28వ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు.
………………………..