జలప్రళయం నుంచి హైదరాబాద్ నగర ప్రజలను కాపాడండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శన
ప్రజాపక్షం/హైదరాబాద్ టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్షాన్ని వీడి జలదిగ్బంధంలో చిక్కుకుని తీవ్ర నష్టానికి గురై నిరాశ్రయులైన హైదరాబాద్ నగర ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమెలా ప్రాంతంలో భారీ వర్షాలకు కూలిపోయిన ఇళ్లను మంగళవారం చాడ వెంకట్ రెడ్డితో పాటు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ సందర్శించి, పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలకు నగరంలో పేద ల గుడిసెలు ఇళ్లు కూలిపోయాయని, వారికి ప్రభుత్వమే వీలైనంత త్వరగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జలప్రళయం వల్ల ఎంతో మంది పేదలు నివాసాలు కోల్పోయి, పునరావాస కేంద్రాల్లో గడుపుతున్నారని, తిండితిప్పలు లేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి నెలకు సరిపడా ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేసి, దెబ్బతిన్న వస్తువులకు నష్టపరిహారాలు ప్రభుత్వం అందించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిపుణుల సూచనలతో ప్రణాళికాబద్ధమైన వరద నివారణ చర్యలు చేపట్టాలని చాడ సూచించారు. ఇటి నరసింహ మాట్లాడుతూ భారీ వర్షాలకు, వరదలకు బడుగు బలహీనవర్గాల ఇళ్లే కూలిపోయాయని, వారికి తిరిగి ఇళ్ళు కట్టించి ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు సాయం అందించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించకుండా చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరావాస కేంద్రాలలో భోజనం, తాగు నీరు, దుప్పట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, నేలమట్టమైన ఇళ్లకు ప్రభుత్వం ప్రకటించిన లక్ష పది వేల ఆర్థిక సహాయాన్ని జాప్యం చేయకుండా వెంటనే అందజేయాలని నరసింహ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ తరఫున బాధితులకు ఆహార పొట్లాలను వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. రాకేష్ సింగ్, నిర్లేకంటి శ్రీకాంత్, దళిత హక్కుల పోరాట సమితి నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వీడి.. ఆదుకోండి!
RELATED ARTICLES