ఏడుగురు కార్మికులు మృత్యువాత
మరో కార్మికుడికి తీవ్ర గాయాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘటన
అహ్మదాబాద్ : గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నగరంలో బుధవారం ఉదయం నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు చెప్పినప్పటికీ ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, గుజురాత్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న నిర్మాణ స్థలంలో ఉదయం 9.30 గంటలకు ప్రమాదం జరిగింది. కార్మికులను తీసుకెళ్తున్న లిఫ్ట్ ఏడవ అంతస్తు నుంచి నేరుగా పడిపోయినట్లు ఓ సీనియర్ పోలీ సు అధికారి ప్రాథమికంగా చెప్పినప్పటికీ, ఆ తరువాత లిఫ్డ్ అదుపు తప్పి కార్మికులపై పడినట్లు వెల్లడించారు. ఆరుగురు కార్మికులు ఎలివేటర్ షాఫ్ట్ లోపల పనిచేస్తుండగా, లిఫ్ట్‌ను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన నిర్మాణం ఒక్కసారిగా కూలిపోవంతో లిఫ్ట్ 13వ అంతస్తు నుంచి కింద కు పడిపోయినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఎల్‌బి జాల తెలిపారు. ఐదువ అంతస్తులో పనిచేస్తున్న మరో ఇద్దరు కార్మికులు కూడా భవనం పైనుంచి కిందపడిపోయారు. మొత్తం ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరో కార్మికుడు చికిత్స పొందుతున్నట్లు జాల చెప్పారు. భవనం వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోనట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలిసింది. కాంట్రాక్టర్ తరుపున నిర్లక్ష్యానికి గురైనట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఎసిపి చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పనిచేస్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ బాధితుల స్వస్థలం పంచమహల్ జిల్లా అని చెప్పారు. వారు ఎలాంటి రక్షణ కవచాలు ధరించలేదన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగినా తమకు సమాచారం అందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అహ్మదాబాద్ చీఫ్ అగ్నిమాపక అధికారి జయేష్ ఖాడియా చెప్పారు. మీడియా ద్వారానే ఘటన విషయం తెలిసిందన్నారు. కార్మికులు లిఫ్ట్ లోపల నిలబడి పనిచేస్తున్న క్రమంలో కొన్ని తెలియని కారణాల ద్వారా లిఫ్ట్ కూలినట్లు ప్రాథమిక విశ్లేషణ ద్వారా అవగతమవుతోందన్నారు. చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే బిల్టర్లపై చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ మేయర్ కిరీట్ పర్మార్ పోలీసులను ఆదేశించారు.
నిర్మాణ భవనంలో కూలిన లిఫ్ట్
RELATED ARTICLES