రాజకీయ పలుకుబడితో కొందరు కిరాణా యజమానులు, హోటల్ నిర్వాహకులు కల్తీ చేస్తున్నారని ఆరోపణలు
ప్రజాపక్షం/నిర్మల్ నిర్మల్ జిల్లా కేంద్రంలో నూనెల కల్తీ దందా ప్రజలను కలవరపెడుతోంది. రాజకీయ పలుకుబడితో బడాబాబులు, కిరాణా దుకాణాల యజమానులు పొరుగు జిల్లాల నుండి నూనెను కొనుగోలు చేసి కల్తీ చేస్తున్నారు. నిర్మల్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో పలువురు అక్రమార్కులు ఉదయం అల్పాహారం నుండి మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ కల్తీ నూనెలతో చేస్తున్నట్లు సమాచారం. పేరున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లు, బేకరీల నిర్వాహకులు అధికారులకు లంచాలు ఎరచూపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నూనెలు, పప్పులు.. ఇలా అన్ని సరుకులను కల్తీమయం చేస్తూ నాసిరకం వంటకాలతో అందినకాడికి దండుకుంటున్నారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులతో కుమ్మక్కై
కల్తీ దందాను మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగిస్తున్నారు. కామారెడ్డి నుండి నిర్మల్ జిల్లా కేంద్రానికి రవాణా మార్గాలు పుష్కలంగా ఉండడంతో అక్కడే పలువురు వ్యాపారులు మంచి నూనెను కల్తీ చేసి నిర్మల్‌కు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ కల్తీ నూనెలకు పేరున్న బ్రాండ్ల లేబుళ్లు వేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయినప్పటికీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఇతర అధికారులు, ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్‌పెక్టర్
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇతర తినుబండరాలు, బేకరీలు తదితర షాపులతో పాటు మాంసం దుకాణాల్లో ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులది. జిల్లాకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారికి సంబంధించిన కార్యాలయం ఉండగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మినహా సిబ్బంది ఎవరినీ నియమించలేదు. దీంతో తనిఖీలు సక్రమంగా జరగడం లేదని తెలుస్తోంది. ఫలితంగా హోటళ్లలో విక్రయించే ఆహార పదార్ధాల నాణ్యతను పట్టించుకునే వారు కరువయ్యారు.
నిర్మల్ జిల్లా కేంద్రంగా జోరుగా నూనెల కల్తీ దందా
RELATED ARTICLES