న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం తాజా తేదీని జారీచేసింది. దోషులకు అన్ని న్యాయ అవకాశాలు ముగిసిపోయాయని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు చెప్పాక అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా కొత్త ఉరి తేదీని ఖరారుచేశారు. మరణశిక్ష పడిన దోషులు ముఖేశ్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ గుప్తా(31). నిందితుల తరఫు న్యాయవాది సైతం ఉరిశిక్ష తేదీని నిర్ణయించడంలో ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని కోర్టుకు తెలిపారు. పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన కొన్ని గంటలకే ఢిల్లీ ప్రభుత్వం దోషులకు డెత్ వారంట్లు జారీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. నిందితులకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు మూసుకుపోయాయని తెలిపింది. నోటీసులు ఏవి అవసరంలేదని ప్రాసిక్యూషన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంగళవారం ఉరి తీయాల్సిన తేదీని కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు వాయిదా వేస్తూ సోమవారం తీర్పు చెప్పింది.ఇప్పటికే ఉరి అమలు తాలూకు డెత్ వారంట్లు మూడుసార్లు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ మూడుసార్లు వాయిదా పడింది.ఈ కేసులో దోషులందరికీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంది.
23న ఢిల్లీ హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు విచారణ
నిర్భయ కేసు దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ కేంద్రం దాఖలుచేసిన అప్పీలును సుప్రీంకోర్టు మార్చి 23న విచారించనున్నట్లు గురువారం తెలిపింది. ఇదిలావుండగా న్యాయపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో వారి ఉరి తేదీని మార్చి 20గా విచారణ కోర్టు ఖరారు చేసిన విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. దోషులు తమ ఆలస్యపు ఎత్తుగడలతో వ్యవస్థను అవహేళన చేస్తున్నారని కూడా తుషార్, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ బోపన్నలు కూడా ఉన్న ధర్మాసనానికి తెలిపారు. కాగా మెరిట్స్ ఆధారంగా మార్చి 23న విచారణ జరుపుతామని, ఎలాంటి వాయిదాలు ఇవ్వబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. All Posts
నిర్భయ దోషులకు 20న ఉరి!
RELATED ARTICLES