కశ్మీర్ లోయలో కర్ఫ్యూ
400 మంది అరెస్టు
జైళ్లుగా మారిన హోటళ్లు, గెస్ట్‌రూమ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి పూర్తి గా రద్దు చేసి, ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లుకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో కశ్మీర్ లోయలో నిర్బంధం కొనసాగుతోంది. అక్కడక్కడా రాళ్లు విసిరి నిరసన తెలియజేస్తున్నారు. అయితే పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోనే ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతుండడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లోని 400 మంది రాజకీయ నాయకులు, వారి అనుచరులు, ప్రత్యేకవాదులను కేంద్ర భద్రతా బలగాలు అరెస్టు చేశా యి. పలు హోటళ్లు, అతిథి గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను తాత్కాలిక జైళ్లుగా మార్చి, వాటిలో 400 మందిని ఉంచారు. సెంటార్, హరి నివాస్, అటవీశాఖ అతిథిగృహం, ప్రొటోకాల్ బిల్డింగ్, ప్రభుత్వ, ప్రైవేటు క్వార్టర్లను తాత్కాలిక జైళ్లుగా మార్చి అరెస్టు చేసిన నేతలను వాటిల్లో ఉంచారు. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దు ల్లా, మెహబూబా ముఫ్తీలను అరెస్టు చేసిన వారిని హరి నివాసాల్లోని వేర్వేరు కాటేజీలకు తరలించారు. ప్రత్యేకవాద నాయకుడైన 91 ఏళ్ల సయ్యద్ అలీషా గిలానీని అరెస్టు చేశారు. తనను హౌస్ అరెస్టు చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కశ్మీర్‌లోయలో శాంతిని నెలకొల్పేందుకు కొంతమంది రాజకీయ నాయకులను హౌస్ అరెస్టు చేశామని జమ్మూకశ్మీర్ డిజిపి దిల్ బాగ్ సింగ్ చెప్పారు.
పరిస్థితులపై గవర్నర్ సమీక్ష
జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో అక్కడ ఇశాంతి భద్రతల పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం సమీక్షించారు. మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నట్లుగా ఆయన తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష కార్యక్రమంలో ఆర్టిక్ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి గవర్నర్ సమీక్షించినట్లు గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రజలకు కావాల్సిన అత్యవసర సేవలు, మార్కెట్లలో నిత్యావసర సరుకులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలు సక్రమంగానే అందుతున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని నిత్యావసర సరుకులు, సేవలు అందుబాటులో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్థుతం శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నదని ఇంతవరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని గవర్నర్ అభిప్రాయపడినట్లుగా తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులకు ఏదైనా అవాంతరాలు ఎదురైన పక్షంలో దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లలోకి భద్రత నిమిత్తం వెళ్ళాలని గవర్నర్ సూచించినట్లుగా అధికార ప్రతినిధి తెలిపారు. గవర్నర్‌తో జరిగిన సమీక్షా సమావేశంలో గవర్నర్ సలహాదారు కె.విజయ్ కుమార్, కె. స్కందన్, ఫరూఖ్‌ఖాన్, చీఫ్ సెక్రెటరీ బివిఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.