HomeNewsBreaking Newsనిర్ణేతలుయువ ఓటర్లే…

నిర్ణేతలుయువ ఓటర్లే…

మొత్తం ఓటర్లలో 35 శాతం వారే…
తెలంగాణలో 43 శాతం యువ ఓటర్లు
నిరుద్యోగం, ఉపాధి, ప్రైవేటీకరణ ప్రధాన అంశాలుగా ఓటు
ఓటర్లలో యువత… ప్రజాప్రతినిధుల్లో వృద్ధులు ఎక్కువ !

ప్రజాపక్షం/ ఖమ్మం దేశంలో యువ ఓటర్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఇదే సందర్భంలో వృద్ధ ప్రజాప్రతినిధుల శాతం కూడా అదేక్రమంలో పెరుగుతూ వచ్చింది. భారతదేశం మొత్తం ఓటర్లలో 35 శాతానికి పైబడి యువ ఓటర్లు ఉన్నారు. వీరి నిర్ణయం రేపటి ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. గత పార్లమెంటు ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు శాతం యువ ఓటర్లు పెరిగినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. యువ ఓటర్లు పెరగడంతో సంప్రదాయ ఓట్లకు కాలం చెల్లి సమస్యల ప్రాతిపదికన ఓట్లు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో యువత ఎక్కువగా మోడీ వైపు మొగ్గు చూపింది. మోడీ ఆకర్షక నినాదాలు యువతను ఆకట్టుకున్నాయి. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, ఉపాధి కల్పన రంగాలపై ప్రధాన దృష్టి, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న కరెన్సీని వెనక్కు తీసుకు రావడం తదితర నినాదాలు యువతను బిజెపి వైపు మొగ్గేలా చేశాయి. దశాబ్ద కాలం తర్వాత మోడీ పాలనలో యువత ఆశలు నిరాశలయ్యాయి. ఉపాధి కల్పన రంగం దాదాపు కుచించుకుపోయింది. ప్రభుత్వపరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఊసే లేదు. అసలు ప్రభుత్వ రంగమే కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో బందీ అవుతున్న సమయంలో ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అన్న ఆలోచనే యువత మదిలో నుంచి తొలగిపోయింది. చివరకు స్వయంగా ప్రధానమంత్రే పకోడీలు అమ్ముకోవడం కూడా ఉపాధే అని ప్రకటించిన తర్వాత రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కదా…. ఒక ఉద్యోగ ప్రకటనన్న వస్తుందా అన్న సందేహం కలుగక మానదు. దేశ వ్యాప్తంగా ప్రతి యేటా కోట్లాది మంది నిరుద్యోగులు తయారవుతున్నారు. రాను రాను భారతదేశం నిరుద్యోగుల కార్ఖానాగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల లో ఇందుకు కారణమైన పాలకులకు వ్యతిరేకం గా తీర్పు ఇవ్వాలనుకోవడం సహాజమేనన్న భావ న వ్యక్తమవుతుంది. గతంలో పాలకులు ఉపాధి కల్పన రంగాల కోసం ప్రత్యేక నిధుల కేటాయిం పు జరిగేది. ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో అనేక సంస్థలను స్థాపించడం జరిగింది. దేశ ఆర్థిక స్థితికి ఊతం ఇచ్చేవిధంగా కార్మాగారాలు ఇతర ఉపాధి సంస్థలను స్థాపించారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండాపోయింది. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు భారంగా మారుతున్న యువతలో కొందరు చెడు మార్గం వైపు పయనిస్తున్నారు. తాము చదివిన చదువుకు తగిటన్లు కొలువు దొరక్క డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.మ రి కొందరు మత్తుకు బానిసలు అవుతున్నారు. ఇది భవిష్యత్‌ భారతంపై తీవ్ర ప్రభావం చూపనుంది. సహజంగానే యువత మదిలో నిజాయితీ, సేవా భావం మెదులుతూ ఉంటుంది. కానీ ఇప్పటి రాజకీయాలలో లోపించిన నైతికత యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపింది .పార్టీ ఫిరాయింపులే కాకుండా ప్రజాప్రతినిధుల అక్రమ సంపాదన కళ్ల ముందు కనపడుతుండటం యువతలో హేయభావాన్ని కలిగిస్తుంది. సామాన్యులుగా రాజకీయాలలో అడుగిడి అనతి కాలంలోనే కోటాను కోట్లకు పడగలెత్తిన కొందరిని చూసిన తర్వాత వారిని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీల పైన, ఆ వ్యక్తులపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజాప్రతినిధుల సంపాదన కూడా రేపటి ఎన్నికల్లో ఓటును నిర్ణయించే అంశాలలో ఒకటిగా మారుతుందనడంలో సందేహం లేదు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు కూడా యువతను ఆలోచింపజేస్తున్నాయి. యావత్‌ దేశ సంపద కొద్ది మంది చేతుల్లో పొగుపడటం భవిష్యత్తులో దేశానికి పెద్ద ప్రమాదం అన్న ఆలోచన ఇప్పుడు ముందుకు వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ల పరం కావడం ఐదు శాతం మంది చేతుల్లో దేశ సంపదలో 90 శాతం ఉండగా 95శాతం మంది వద్ద 10 శాతం సంపద ఉండటం పైన చర్చ సాగుతుంది. ఇటీవల కేంద్రంలోని ప్రభుత్వం తీసుకు వచ్చిన మత పరమైన నినాదాలు, విధానాల పట్ల యువతలో వ్యతిరేకత వ్యక్త మవుతుంది. మెజార్టీ, మైనార్టీ ప్రాతిపదికన సాగే ప్రభుత్వ నిర్ణయాలను యువత వ్యతిరేకిస్తుందన్న విషయం విధితమే.వీటన్నింటి ప్రాతిపదికనే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు రానున్నాయి. ఇదిలా ఉండగా దేశ ఓటర్లలో యువ శాతం పెరుగుతుండగా ప్రజాప్రతినిధుల్లో మాత్రం వృద్దుల శాతం పెరుగుతూ వచ్చింది. 45 సంవత్సరాల లోపు ఉన్న వారు నాలుగింట ఒక్కరు మాత్రమే ఉన్నారంటే ప్రజాప్రతినిధుల్లో ఏ మేరకు యువత ఉందో అర్థమవుతుంది. ఇక తెలంగాణలోనూ ఈ సంవత్సరంతంలో శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 2.99 కోట్ల ఓటర్లు ఉండగా ఇందులో యువ ఓటర్లు 1.27 కోట్ల మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణలోనూ గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ తదితర అంశాలు ఓటర్లను ప్రత్యేకించి యువ ఓటర్లను అంతగా ప్రభావితం చేయకపోవచ్చు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments