నా ఎన్నికే రుజువు చేసింది : ద్రౌపది ముర్ము
15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: దేశంలో నిరుపేదలు కూడా తమ కలలు సాకారం చేసుకోగలరని తన ఎన్నిక రుజువు చేసిందని కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. “ఇది నా ఒక్క వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతి పేదవాడి విజయం” అని ఆమె అన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆనందోత్సాహాల మధ్య సోమవారం ఉదయం ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడో మారుమూల సుదూరప్రాంతంలో పేదరికంలో జీవించే ఒక మహిళ భారతదేశ అత్యున్నత పీఠాన్ని అధిష్టించడం దేశ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెబుతోందని ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆమె అన్నారు. పార్లమెటుసెంట్రల్ హాలులో వైభవంగా జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆధునిక భావజాలంతో, గొప్ప గొప్ప కోరికలు, ఆశలతో వర్ధిల్లే దేశానికి ఇదొక ‘కీలకమైన మైలురాయిలాంటి రోజు’ అని అన్నారు. 14వ రాష్ట్రపత రామ్‌నాథ్ కోవింద్ స్థానంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న ముర్ము ఈ అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన రెండవ మహిళ. స్వాతంత్యానంతరం జన్మించి అతి తక్కువ వయసులో రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి మహిళగా ముర్ము (64) చరిత్ర సృష్టించారు. దేవుడి పేరుతో ఆమె ప్రమాణం చేశారు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తానని, చట్టాలను కాపాడతానని ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు. “ఒడిశాలోని ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఒక మారుమూల ఉన్న గ్రామంలో తిరుగాడిన ఒక బాలిక అక్కడి నుండి రాష్ట్రపతి భవనం వరకూ కొనసాగిన తన ప్రయాణం, ఈ పదవిని అధిష్టించడం భారతదేశ ప్రజాస్వామ్య శక్తిసామర్థ్యాలను రుజువు చేస్తోందని ఆమె పునరుద్ఘాటించారు. హిందీభాషలో ప్రసంగించిన ముర్ము “జోహార్” అనే సంప్రదాయబద్ధమైన గిరిజనభాషా శుభాకాంక్షల పదంతో తన ప్రసంగం ప్రారంభించారు. “ఇది నా ఒక్కరి విజయం కాదు, ప్రతిపేదవాడి విజయం కూడా, పేదవాడు కూడా తన కలలను సాకారం చేసుకోవచ్చునన చాటి చెప్పే విజయం” అన్నారు ముర్ము.18 నిమిషాలసేపు కొనసాగిన ఆమె ప్రసంగంలో నిరుపేద, గిరిజులకు సంబంధించిన అనేక సమస్యలను, విషయాలను ప్రస్తావించారు. దేశ సుస్థిర అభివృద్ధి,డిజిటల్ ఇండియా అభివృద్దికోసం ప్రభుత్వ చేస్తున్న కృషి, స్థానిక సమస్యలు, కొవిడ్ కష్టకాలంలో ఎంతో సమర్థంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుతెన్నులను ఆమె ప్రముఖంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాగా ముర్ము ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆమె సొంతజిల్లా, సొంత గ్రామం సహా దేశంలోని పలు ప్రాంతాలలో ఉత్సవాలు చేశారు. సమాజంలో అట్టడుగగున ఉండే ఒక గిరిజన మహిళ అత్యున్నతపీఠం అధిష్టించడం దేశానికి గర్వకారణం అనే సందర్భాని ఉటంకిస్తూ ఈ ఉత్సవాలు పలుచోట్ల చేశారు. “ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా వర్థిల్లే మన భారతదేశ గొప్పతనం ఇదే” అని ఆమె అన్నారు. ఆమె ఆమాటలు అంటున్నప్పుడు సభికులలో కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,విశ్రాంత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్,ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులూ,పార్లమెంటు సభ్యులూ హర్షధ్వానాలతో కరతాళధ్వనులు చేశా
సంథాల్ కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము ఒకచిన్న గిరిజన గ్రామంలో పుట్టి అక్కడే పెరిగి అక్కడే విద్యాభ్యాసం చేశారు. ఆ గ్రామం నుండి కాలేజీలో సీటు సంపాదించుకుని కాలేజీ చదువు చదివిన తొలిమహిళ ఆవిడే. “శతాబ్దాలుగా హక్కులకు, అధికారాలకు నోచుకోకుండా వెనుకబడిపోయిన వర్గాలకు గొప్ప సంతృప్తిని ఇచ్చే దినం ఇది, దేశాభివృద్ధిలో ప్రయోజనాలను పేదలకు, గిరిజనులకు,వెనుకబడినవర్గాలకు ఇన్నాళ్ళుగా తిరస్కరించారు,ఇప్పుడువారంతా తమను తాము నాలో చూసుకుంటారు,నాలో వారి ప్రతిబింబం గోచరిస్తుంది” అని ముర్ము అన్నారు.దేశంలో పేద,బడుగు,బలహీనవర్గాలు, వెనుకబడిన,గిరిజన వర్గాల ఆశీర్వాదమే నా ఎన్నిక అని ఆమె ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న మహోన్నతులైన సమరయోధులందరికీ ఆమె నివాళులు అర్పించారు. దేశంలో అందరి కృషి, అందరూ నిర్వర్తించే కర్తవ్యపాలనతోనే ప్రజలందరి ఆశయాలు, అంచనాలు నెరవేరతాయని ఆమె అన్నారు. “సంథాల్ విప్లవం, పైకా విప్లవం,కోల్ విప్లవం, భిల్ విప్లవం…వంటివన్నీ దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాయని ఆమె గుర్తుచేసుకున్నారు. ఏకత్వం ఉట్టిపడే భారతదేశం ‘ఏక్ భారత్,శ్రేష్ట భారత్’ నినాదంతో అనేక భాషలు, మతాలు, తెగలు,ఆహార అలవాటు,జీవన విలువలు, సంప్రదాయాలతో ప్రవర్థమానమతోందన్నారు. ముర్ము పదవీ ప్రమాణాన్ని ప్రధానమంత్రి ఒక కీలకఘట్టంగా అభివర్ణించారు. యావత్ భారతదేశం ఎంతో గర్వంతో, ఆత్మవిశ్వాసంతో ఈ ఉత్సవాన్ని తిలకించిందని అన్నారు. తొలుత ముర్ముకు త్రివిధ దళాలు 21 సార్లు గాలిలోకి తుపాకులు పేల్చి సైనికవందనం చేశాయి. రామ్‌నాథ్ కోవింద్,ముర్ము ఇద్దరూ మేళతాళాలతో పార్లమెంటు సెంట్రల్ హాలు వరకూ ఊరేగింపుగా వచ్చారు.
కోవింద్‌కు ఘనంగావీడ్కోలు
కాగా 14వ రాష్ట్రపతిగా వీడ్కోలు తీసుకున్న రామ్‌నాథ్ కోవింద్, ఆయన కుటుంబ సభ్యులు లుథ్యెన్స్ ఢిల్లీలోని బంగ్లాకు తరలివెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు, రాష్ట్రపతి భవనం సిబ్బంది వారి కుటుంబానికి ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా కొత్త రాష్ట్రపతి ముర్ము 2009 మధ్యకాలంలో తన భర్తను, ఇద్దరు కుమారులను,సోదరుణ్ణి,తల్లిని కోల్పోయారు. ముర్ము కుమార్తె ఇతిశ్రీ ఒడిశాలోని ఒక బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
నిరుపేదలూ తమ కలలను సాకారం చేసుకోగలరు!
RELATED ARTICLES