భక్తుల సందడి లేని ఆలయాలు
కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికగా నిలిచే బోనాల పండుగ ఉత్సవాలు ఈసారి నిరాడంబరంగా జరిగాయి. దేవాలయాల దగ్గర పెద్దగా భక్తుల సందడి లేకుండాపోయింది. అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి బోనాల పండుగను ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇళ్లలోనే నిర్వహించుకున్నారు. దేవాలయాల బయటనే అమ్మవారికి మొక్కుకొని, కొబ్బరికాయాలు కొట్టారు. కొన్నిచోట్ల మాత్రం పరిమిత సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగా బోనాల ఉత్సవాలు జంట నగరాల చరిత్రలోనే మొదటిసారిగా జరిగాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు పోతురాజులు వీరంగాలు, శివసత్తుల శిగాలు లేకుండానే సాదాసీదాగా వేడుకలు నిర్వహించారు. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు జరిగిన ఉత్సవాలు సోమవారం రంగం భవిష్యవాణితో ముగియనున్నాయి. బోనాల పండుగ రోజు జోష్‌గా ఉండే జం ట నగరాలు ఈసారి కరోనా కారణంగా కళ తప్పింది. దేవాలయాల దగ్గర మై కులు, సౌండ్ బాక్స్‌ల ద్వారా పాటలతో దద్దరిల్లి పోతుండే ఉత్సవాలు. శివసత్తుల శిగాలు, పోతురాజుల వీరంగాలు లేకుండానే పండుగను నగరవాసులు సాధారణంగా నిర్వహించుకున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళీ అమ్మవారి ఆలయంలో గత 27 రోజులు గా జరుగుతున్న చండీయాగం ఆదివారంతో ముగిసింది. ఉప్పుగూడ నుంచి అమ్మవారి దేవాలయం మీదుగా మీరాలం మండికి బంగారు బోనం సమర్పించారు. రోజంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి శాంతికల్యాణం కార్యక్రమం నిర్వహించారు. సోమవారం అమ్మవారి ఊరేగింపుతో బోనాల పండుగ జాతర ముగుస్తాయని దేవాలయ కమిటీ సభ్యులు చెప్పారు.
బోనాలు సమర్పించిన భక్తులు
అమ్మవారి దేవాలయాలకు వెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే నగరంలో చాలాచోట్ల భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సాధారణ రోజుల్లో జరిగే పండుగకు వచ్చినంతగా భక్తులు రాలేదు. అడపాదడప ఒక్కొక్కరుగా భక్తులు దేవాలయాలకు వచ్చి, బోనాలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. రాంనగర్ పోచమ్మ దేవాలయం, పార్శిగుట్ట బంగారు మైసమ్మ, వనస్థలిపురం శ్రీ కనకదుర్గ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ట్యాంక్‌బండ్ కనకాల కట్టమైసమ్మ దేవాలయం, సైదాబాద్ మాతమైదానంలో అమ్మవారికి ఆలయం బయటే భక్తులు బోనాలు సమర్పించారు. కోఠి, సుల్తాన్‌బజార్, నాంపల్లి, అంబర్‌పేట్‌లలో దేవాలయాల కమిటీల ద్వారా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి పీడ తొలగిపోతే వచ్చే సంవత్సరం ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించుకుంటామని భక్తులు చెప్పారు.
నిరాడంబరంగా బోనాలు
RELATED ARTICLES