HomeNewsLatest Newsనిరసన జ్వాల

నిరసన జ్వాల

ఐఎంఎ పిలుపు మేరకు కదం తొక్కిన వైద్యులు
24 గంటలపాటు అత్యవసరం కాని వైద్య సేవల బహిష్కరణ
ప్రభుత్వ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో స్తంభించిన వైద్యసేవలు
కమిటీ వేస్తాం..విధుల్లో చేరండని కేంద్రం హామీ

న్యూఢిల్లీ : కోల్‌కతాలోని ఆర్‌జి కార్‌ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనపై శనివారం నాడు దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు ప్రజ్వరిల్లాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) ఇచ్చిన 24గంటల వైద్యసర్వీసుల బహిష్కణ పిలుపుపై దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల ప్రధాన ఆసుపత్రులలో డాక్టర్లు, వైద్యవిద్యార్థులు పెద్ద సంఖ్యలో కదిలారు. హత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు భద్రత కల్పిస్తూ వెంటనే కేంద్ర రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ నిరసనగళం వినిపించారు. ఆసుపత్రులలో ఎమర్జెన్సీ మినహా ఔట్‌ పేషెంట్‌ (ఓపి), సర్జరీ సేవల విధులను శనివారం (17వతేది) ఉదయం ఆరుగంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న ఐంఎంఎ పిలుపుకు యావత్‌ దేశంలోని వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు పెద్దయెత్తున స్పందించి విజయవంతం చేశారు. అయితే ఆగష్టు 9న 31సంవత్సరాల పిజి విద్యార్థినిపై ఆర్‌జి కార్‌ హాస్పిటల్‌లో అత్యంత దారుణంగా హత్యాచారం జరిగిన సంఘటనపై ఐఎంఎ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఎ శుక్రవారం 5డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది. డాక్టర్లు పనిచేసే స్థలాలలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు సరైన వసతి సౌకర్యాలు, భద్రత, సురక్షిత విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని, వారు పనిచేసే స్థలాలలో హెల్త్‌వర్కర్లపై హింసకు తావులేకుండా గట్టి చర్యలు చేపట్టాలని, విమానాశ్రయాలలో భద్రతా ప్రోటోకాల్స్‌ తరహాలో సిసిటివిలు, సెక్యూరిటీ బలగాలను నియమించాలని, వైద్యులపై దౌర్జన్యాలు, అత్యాచారం, హత్యల దాడి జరిగిన సందర్భాలలో నిర్ధిష్ట కాలవ్యవధిలో దోషులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని, బాధితకుటుంబాలకు నేర తీవ్రతను బట్టి సముచితమైన నష్టపరిహారం అందజేసి వారిని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఐఎంఎ తన డిమాండ్లను అందజేసింది. కోల్‌కతాలోని ప్రభుత్వ హాస్పిటల్‌ ఎస్‌ఎస్‌కెఎంలో, శంభునాథ్‌పండిట్‌ హాస్పిటల్‌ , కోల్‌కతా నేషనల్‌ మెడికల్‌ కాలేజీలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు 24గంటలపాటు డ్యూటీలను బహిష్కరించి నిరసన చేపట్టారు. జార్ఖండ్‌లో కూడా వైద్యులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా ఓపిడి, సర్జరీ విధులను వైద్యులు బహిష్కరించినట్లు తెలిపారు. రాంచీలోని ఆర్‌ఐఎంఎస్‌ (రిమ్స్‌), ఐదు మెడికల్‌ కళాశాలల జూనియర్‌ డాక్టర్లు ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించినట్లు చెప్పారు. అసోంలో కూడా మొదటిరోజైన శనివారం రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో డాక్టర్లు బ్యాడ్జీలను ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలని గౌహతి మెడికల్‌ కాలేజి, హాస్పిటల్‌(జిఎంసిహెచ్‌)లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌), ఎఐఐఎంఎస్‌ సహా పలు ప్రభుత్వ హాస్పిటల్‌లలోని రెసిడెంట్‌ డాక్టర్లు పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విధులను బహిష్కరించారు. గోవా, కర్నాటక, కేరళ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఒడిశా, త్రిపురలో కూడా ఐఎంఎ పిలుపును డాక్టర్లు విజయవంతం చేశారు. కోల్‌కతా ఆర్‌జి కార్‌ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న హత్యాచార ఘటన వివాదం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి మధ్య రావణకాష్టంలా రగులుతోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మమతా బెనర్జీ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొని నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, సిబిఐ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.
సిబిఐ ముందు డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌
ఆర్‌జికార్‌ మెడికల్‌ కాలేజి, హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ రెండో రోజైన శనివారం నాడు సిబిఐ విచారణకు హాజరయ్యారు. హాస్పిటల్‌లో ఆగష్టు 9వ తేదీ, ముందు రోజు పరిణామాలపై సిబిఐ ప్రశ్నలు సంధించింది. శుక్రవారం నాడు మొదలైన విచారణ శనివారం కూడా కొనసాగింది. హత్యాచారం తర్వాత ఈ సంఘటన గురించి కుటుంబానికి, పోలీలకు ఎవరు సమాచారం అందించారని సిబిఐ విచారణాధికారులు డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను ప్రశ్నించారు. హత్యాచారానికి గురైన మహిళా వైద్యురాలు వీక్లీ రోస్టర్‌ ప్రకారం డ్యూటీని 36గంటలే కాకుండా 48గంటలపాటు ఎందుకు చేయాల్సివచ్చిందన్న ప్రశ్నకు డాక్టర్‌ సందీప్‌ వివరణ ఇచ్చారు.
కమిటీ ఏర్పాటు చేస్తాం..సమ్మె విరమించండి
దేశవ్యాప్తంగా ఐఎంఎ పిలుపుపై డాక్టర్లు 24గంటలపాటు విధుల భహిష్కరణపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. డాక్టర్ల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. వైద్యులు వెంటనే ఆందోళన విరమించి వారి సర్వీస్‌లలో పాల్గొనాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది.కోల్‌కత్తా హత్యాచార ఘటన నేపథ్యంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ (ఫోర్డా), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) అసోసియేషన్లు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. వారి డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం నిరసన కార్యక్రమాలు సద్దుమణిగే అవకాశం లేకపోలేదు.
ఎఐటియుసి మద్దతు
కోల్‌కత్తాలో మహిళా పిజి డాక్టర్‌పై దారుణ హత్యాచారానికి నిరసనగా సమ్మె చేస్తున్న డాక్టర్‌లకు ఎఐటియుసి మద్దతు ప్రకటించింది. ఘటన జరిగి వారం రోజులవుతున్నా దర్యాప్తులో ముందడుగు పడకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ఘటనపై ఫాస్ట్‌ ట్రాక్‌ ్దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో డాక్టర్‌ సామూహిక అత్యాచారానికి గురైనట్లు ఆధారాలు ఉన్నాయని, ఈ ఘటనలో పలువురు పాల్గొన్నట్లు స్పష్టమవుతున్నా ఒక్కరినే అరెస్టు చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని అమర్‌జీత్‌ కౌర్‌ కోరారు. ఆర్‌.జి.కార్‌ మెడికల్‌ ఆసుపత్రిపై చర్య తీసుకోవాలని, అక్కడ పని చేసే వైద్యులు, నర్సులు, ఇతర పనివారి పని పరిస్థితులపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నిర్దిష్ట పని గంటల కోసం చట్టం తీసుకురావాలని అన్నారు. కోల్‌కత్తా ఘటనపై పోరాటం చేస్తున్న వైద్యులకు ఎఐటియుసి సంపూర్ణ మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎఐటియుసి అనుబంధ అఖిల భారత వర్కింగ్‌ విమెన్‌ ఫోరమ్‌ వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న డాక్టర్‌ల నిరసన కార్యక్రమాల్లో సంఘీభావంగా పాల్గొంటుందని పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments