HomeNewsBreaking Newsనిరంతర దోపిడీ

నిరంతర దోపిడీ

కనీసం కంటే తక్కువగా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం
అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ బివి విజయలక్ష్మి
ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో భారీ ధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం కంటే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే వేతనం చాలా తక్కువ అని అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ బి.వి. విజయలక్ష్మి అన్నారు. వీరిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన మహిళలు, వితంతువులు ఉన్నారని, రోజుకు రూ. 30 కూలీ కూడా అందడం లేదని, దీనితో పాటు సకాలంలో వంట బిల్లులు, వేతనాలు చెల్లించక ప్రభుత్వం నిరంతర దోపిడీకి గురిచేస్తుందని విమర్శించారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల రాష్ర్ట వ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌లో గురువారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం(ఎఐటియుసి) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాలనుండి వందలాదిమంది మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాలో పాల్గొని తమసమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో డాక్టర్‌ బి.వి. విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ర్ట అధ్యక్షులు పి. ప్రేమ్‌ పావని అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ధర్నాను ఉద్దేశించి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 54201పైగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు 28 లక్షలకుపైగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నారన్నారు. రెండు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం నిరాఘాటంగా కొనసాగేందుకు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి విద్యార్థులకు సకాలంలో ఆహారాన్ని అందిస్తున్న వంట కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కడంలేదన్నారు.
ఐదారునెలల నుంచి అందని బిల్లులు, వేతనాలు..
అప్పులు చేసి కూరగాయలు, కిరాణం సామాన్లు, కోడి గుడ్లు కొనుగోలు చేసి వంటలు చేస్తే, వండిన వంటకు బిల్లులతోపాటు వేతనాలు కూడా అయిదు, ఆరు నెలల వరకు రాక తెచ్చిన అప్పులు తీరక అప్పులు లభించక మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం ముఖ్యమైన పోషకాహార పథకంగా పరిగణించబడుతున్న విషయం రాష్ర్ట ప్రభుత్వానికి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. కార్మికులు వంటలు చేస్తున్న సందర్భంలో కట్టెల పొగతో కంటి చూపులు దెబ్బతింటున్నాయని, కొన్ని సందర్భాలలో వేడి గంజి మీదపడి కాళ్ళు, చేతులు కాలిన సందర్భాలు చాలా పాఠశాలల్లో జరిగాయన్నారు. ప్రభుత్వం వీరి సమస్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తక్షణమే స్పందించి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు.
న్యాయమైన డిమాండ్‌లు పరిష్కారం కోసం సమ్మె తీవ్రతరం చేయాలి : ఎస్‌. బాలరాజ్‌
ఎఐటియుసి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాలరాజ్‌ మాట్లాడుతూ సంవత్సరంన్నర క్రితం భోజన పథకం కార్మికులకు రూ.1000 ఉన్న గౌరవ వేతనాన్ని రూ. 3000 లకు పెంచుతున్నట్లు ప్రకటించారని, ఇప్పటివరకు పెంచిన వేతనాలు వంట కార్మికులకు ఖాతాలో జమకాలేదని తెలిపారు. వంట ఖర్చుల బిల్లులు కూడా చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం కనికరంలేకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌ల సాధనకు సమ్మెను ఇంకా తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఎటియుసి వంట కార్మికులకు మద్దతుగా ఉంటుందని బాలరాజ్‌ భరోసా ఇచ్చారు. సంఘం ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ మాట్లాడుతూ వేతనాలతో పాటు వంట కార్మికుల వంట బిల్లులు 9 నెలల కాలంగా పెండింగ్‌ ఉన్నాయని, అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందుకే రాష్ర్ట వ్యాప్తంగా సమ్మె చేపట్టాల్సి వచ్చిందన్నారు.
ఈనెల 17 నుంచి ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలి : పి.ప్రేమ్‌ పావని
పి. ప్రేమ్‌ పావని మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమ్మెలో భాగంగా ఈ నెల 17 న ఎంఎల్‌ఎల ఇళ్లను, 19న మండల విద్య అధికారుల కార్యాలయాలను, 21న జిల్లా విద్య అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. 25న జిల్లాల లేబర్‌ అధికారికి వినతి పత్రం అందజేస్తామని, అయినా రాష్ర్ట ప్రభుత్వం స్పందించకుంటే వేలాదిమంది మధ్యాహ్న భోజన వంట కార్మికులతో ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఎఐటియుసి రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, కార్యదర్శి నండూరి కరుణకుమారి, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు డి. కమల రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పూసల రమేష్‌, ఉపాధ్యక్షులు కోరిమి సుగుణ, కుంటల రాములు, దండు లక్ష్మణ్‌, చెన్నం దశరథం, కార్యదర్శులు బి. రాజేశ్వరి, బి. ప్రసాద్‌, దర్యాల రామ్మూర్తి, బొజ్జ సాయిలు, నేతలు రమేష్‌, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments