HomeNewsBreaking Newsనిరంతరం ప్రజల కోసమే...

నిరంతరం ప్రజల కోసమే…

కార్మిక, అసంఘటిత, విద్యార్థి, మహిళ, రైతు వర్గాల సమస్యల పరిష్కారానికి సిపిఐ పోరాటం
దేశ ఐక్యతకు విఘాతం కలిగించే శక్తులను తరిమికొట్టాలి
సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు అతుల్‌కుమార్‌ అంజాన్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌: కమ్యూనిస్టులను మించిన దేశభక్తులు లేరని, తమ నుంచి దేశభక్తిని నేర్చుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్‌కుమార్‌ అంజాన్‌ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులను బ్రిటీష్‌ ప్రభుత్వం అణచివేసిందని, అక్రమ కేసులతో10 నుంచి 20 ఏళ్ల వరకు జైలులో బంధించిందని తెలిపారు. దేశభక్తి పార్టీగా చెప్పుకునే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాటి స్వాతంత్య్ర ఉద్యమంలోనే పాల్గొనలేదని, ఇప్పటివరకు వారు స్వాతంత్య్రానికి చెందిన పాటను పాడలేదని, రాయలేదని, కమ్యూనిస్టులు రాసిన పాటలనే ఉపయోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. “సిపిఐ 97వ వ్యవస్థాపక దినోత్సవ” సందర్భంగా ఆదివారం హిమాయత్‌నగరలోని మగ్ధుంభవన్‌లో సభను నిర్వహించారు. తొలుత పార్టీ జెం డాను అతుల్‌ కుమార్‌ అంజాన్‌ ఆవిష్కరించారు. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా అతుల్‌ కుమార్‌ అంజాన్‌తో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, ఎన్‌.బాలమల్లేష్‌, వి.ఎస్‌.బోస్‌, సిపిఐ సీనియర్‌ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, జైని మల్లయ్య గుప్తా, ప్రముఖ కవి ఏటుకూరి ప్రసాద్‌, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి
ఈ.టి.నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలుమాకుల జంగయ్య, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్‌ పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కందిమళ్ల ప్రతాప్‌ రెడ్డి, ఏటుకూరి ప్రసాద్‌లను అతుల్‌కుమార్‌, చాడ వెంకట్‌రెడ్డి, జైని మల్లయ్య గుప్తాను సయ్యద్‌ అజీజ్‌ పాషా శాలువాతో సన్మానించారు. అనంతరం అతుల్‌ కుమార్‌ అంజాన్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన మొట్టమొదటి పార్టీ సిపిఐ అని అన్నారు. మహాత్మాగాంధీ మొదట సంపూర్ణ స్వాతంత్య్రానికి పూనుకోలేదని, ఆ తర్వాత తన మనసును మార్చుకున్నారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత సుమారు 450 మంది జైలులో ఉన్న పోరాట వీరులంతా సిపిఐలో చేరారన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఏ మతాలకు, భాషలకు, భావాలకు వ్యతిరేకం కాదని, అన్ని మతాలను, భాషలను, భావాలను గౌరవిస్తామన్నారు. కార్మిక, అసంఘటిత, విద్యార్థి, మహిళా, రైతు అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి సిపిఐ పోరాటం చేసిందని, తాము నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగి, దేశాన్ని, ఐకమ్యత్యాన్ని రక్షించు కోవాలని సూచించారు. దేశ ఐక్యతకు విఘాతం కలిగించే శక్తులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నాగ్‌పూర్‌లోని నారంగి(ఆర్‌ఎస్‌ఎస్‌), హైదరాబాద్‌లోని బిర్యానీ(ఎంఐఎం)లతో దేశానికి ప్రమాదకరమన్నారు. ఈ బిర్యానీ బిజెపికి స్నేహితుడని చెప్పారు. మోడీ, యోగీ, భోగి అంతా కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని, కాంగ్రెస్‌, బిజెపి ఆర్థిక విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి, దేశాన్ని అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చివరకు హైదరాబాద్‌ పేరును కూడా బిజెపి మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో 109 రిజిస్టర్‌ రాజకీయ పార్టీలు ఉన్నాయని, పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని, ఆ పార్టీలకు తండ్రీ తల్లి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దుస్తులు మార్చినంత సులువుగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారని, పార్టీలు మారడం ఒక ఫ్యాషన్‌గా మారిందన్నారు.
సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ మొత్తం ఓట్లలో మెజార్టీ ఓట్లు రాకపోయినా గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ లేకుండా చేసేందుకు కార్పొరేట్‌ శక్తులు కొందరితో కలిసి కుట్ర చేసిందన్నారు. భారత స్వాత్యంత్య్ర పోరాటంలో సిపిఐ ఎంతో త్యాగం చేసిందని, అనేక మంది నాయకులు జైల్లో ఉండాల్సివచ్చిందన్నారు.
చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ రాజకీయ ఓనమాలను నేర్పిందన్నారు. మొదట ప్రజా సంఘాలను ఏర్పాటు చేసిందే సిపిఐ అని, వాటిని రూపుదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. స్వాతంత్య పోరాటంలో సిపిఐ అనేక ఆటుపోట్లను, అణచివేతలను ఎదుర్కొన్నదని, పార్టీపై నిషేధం కూడా విధించారని, అక్రమంగా కుట్ర కేసులు బనాయించారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షకు తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. పోరాడితే విజయం తప్పదని రైతుల పోరాటం నిరూపించిందని, పోరాటాలు, ఉద్యమాలు అంతిమంగా విజయాన్ని చేకూరుస్తాయన్నారు. పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అనేక ఉద్యమాలకు సిపిఐ కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. కాంగ్రెస్‌ తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర సిపిఐకే ఉన్నదన్నారు. కందిమళ్ల ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ సిపిఐ చరిత్ర చాలా గొప్పదని, మనవాళ్లు చేసిన త్యాగాలను స్మరించుకుని, కర్తవ్యాన్ని ఎంచుకోవాలని సూచించారు. జైని మల్లయ్య గుప్తా మాట్లాడుతూ గాంధీని చంపిన వారే అధికారంలో ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా సిపిఐ వ్యవస్థాపకదినోత్సవాన్ని ఆదివారం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హన్మకొండ బాలసముద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో అరుణ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోపిడీ వ్యవస్థ అంతం, సమసమాజ నిర్మాణం కమ్యూనిజంతోనే సాధ్యమన్నారు. ఆకలి, దోపిడీ అంతం కావాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కమ్యూనిజాన్ని కాంక్షించడం అనివార్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో బస్టాండ్‌ సెంటర్‌లో సిపిఐ పతాకాన్ని సిపిఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనర్సింహ్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోసించిన కమ్యూనిస్టు పార్టీ అనంతరకాలంలో కూడా దేశంలో పేదరిక నిర్మూలన కోసం, దొరలు, భూస్వాములు, పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా స్వేచ్చ మానవహక్కుల కోసం, సకల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న్దన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments