అదానీ వ్యవహారంపై రెండోరోజూ పట్టువీడని ప్రతిపక్షాలు
జెపిసి, సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు కమిటీకి డిమాండ్
ఉభయసభలూ సోమవారానికి వాయిదా
రాజ్యసభలో కాంగ్రెస్, సిపిఐ సహా 15 పార్టీల నోటీసులు తిరస్కృతి
న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ వ్యవహారంపై వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలు, నినాదాలతో పార్లమెంటు దద్దరిల్లిపోయింది. అదానీ సృష్టించిన సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక దర్యాప్తు కమిటీ నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినప్పటికీ ఉభయసభల్లో సభాపతులు చర్చకు తిరస్కరించారు. ఉభయసభల్లోనూ ఈ సమస్యపై చర్చించాలని కోరుతూ పలుపార్టీల నాయకులు సభాపతులకు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాజ్యసభలో సిపిఐ, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సహా 15 పార్టీల ఎంపీలు ఇచ్చిన నోటీసులను సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్ తిరస్కరించారు. రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో కూడా ఎంపీలు ఇదే రీతిన స్పీకర్ ఓం బిర్లాను కోరారు. కొద్దిసేపటి తరువాత సభ క్రమశిక్షణ తప్పిందనే సాకుతో ఉభయసభలూ సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ సమస్యపై చర్చించాలని కోరుతూ జగదీప్ ధన్‌కర్‌కు పలు పార్టీల ఎంపీలు 15 నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులన్నింటినీ ధన్‌కర్ తిరస్కరించారు. చర్చకు అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో సభలో మరింత గందరగోళం పెరిగింది. సభలో క్రమశిక్షణ పాటించాలని, నిర్దేశించిన కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని ధన్‌కర్ సభ్యులను గందరగోళం మధ్య కోరారు. “సభా నిబంధనల ప్రకారం మనం పనిచేయవలసిన అవసరం ఉంది, నా దగ్గరకు 15 పార్టీలకు చెందిన నోటీసులు వచ్చాయి. 267 నిబంధనల కింద చర్చ చేపట్టాలని కోరారు, ఆ నోటీసులన్నింటినీ నేను క్షుణ్ణంగా చదివాను, ఈ నోటీసులన్నీ 267 నిబంధల అమలువీలైన అవసరాలు తీర్చేవిగా లేవు, పైగా 2022 డిసెంబరు 8వ తేదీన సభాధ్యక్షుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కూడా ఈ నోటీసులు లేవు, అందువల్ల వీటిని తిరస్కరిస్తున్నాను” అని ధన్‌కర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసనలు, కేకలతో సభ దద్దరిల్లిపోయింది. ఈ 15 నోటీసులలో ఆరు నోటీసులు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, సయ్యద్ నజీర్ ప్రమోద్ తివారీ, కుమార్ కెఠ్‌కర్, అమీర్ యజ్ఞిక్, నీరజ్ దంగిల నుండి సభాధ్యక్షుడికి అందాయి. బిఆర్‌ఎస్ నాయకుడు కె.కేశవరావు, సిపిఐ సభ్యుడు సంతోష్ కుమార్, సిపిఐ(ఎం) నాయకుడు ఎలమరమ్ కరీన్, సంజయ్ సింగ్, ప్రియాంకా చతుర్వేది, జాన్ బ్రిట్టాస్, ఎ.ఎస.రహీమ్, వి.శివదాసన్, తిరుచ్చి శివ సభాపతికి నోటీసులు ఇచ్చారు. కానీ వాటన్నింటినీ జగదీప్ ధన్‌కర్ తిరస్కరించారు. ఒక ప్రశ్నకు జగదీప్ ధన్‌కర్ సమాధానం చెబుతూ, సభ్యులు 267వ నిబంధనను చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు. సభ ఉదయం వాయిదా పడి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి సమావేశమైన తరువాత కూడా అదే పరిస్థితి తలెత్తింది. “రాజ్యసభలో సంబంధిత నిబంధనలకు అనుగుణంగా జీరో అవర్‌ను, ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేయండి, ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో పెట్టుబడుల మోసం, వాటి మార్కెట్ విలువ తగ్గిపోవడం వంటి సమస్యలపై చర్చకు అనుమతించండి, దీనివల్ల కోట్లాదిమంది భారతీయుల పొదుకునకు తీవ్ర ముప్పు వాటిల్లింది” అని ప్రతిపక్ష ఎంపీలు తమ వాయిదా తీర్మానాల్లో పేర్కొన్నారు.
లోక్‌సభ వాయిదాలోక్‌సభలో కూడా ప్రతిపక్షాలు అదానీ సృష్టించిన సమస్యపై చర్చ జరగాలని పట్టు పట్టారు. సభలో సభ్యుల డిమాండ్లు, నినాదాలతో సభ దద్దరిల్లింది. ఆ తర్వాత సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. సభ తిరిగి సోమవారం సమావేశం అవుతుంది. నిరసనలు తెలియజేయడం ఆపేయాలని, సభా కార్యకలాపాలు కొనసాగించేలా సహకరించాలని సీకర్ సభ్యులను కోరారు. చివరకు మధ్యాహ్నం రెండుగంటల వరకూ సభను స్పీకర్ వాయయిదా వేశారు. ఆ తరువాత సమావేశమయ్యాక కూడా సభలో ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, డిమాండ్లు ఆగకుండా కొనసాగాయి. సభాధ్యక్షస్థానంలోకి వచ్చిన రాజేంద్ర అగర్వాల్ సభ్యులను తమ తమ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చకు అనుమతించాలని కోరినప్పటికీ, అతిముఖ్యమైన ప్రజాసమస్యగా ఉన్న హిండెన్‌బర్గ్ నివేదికపైనే సభలో మొదట చర్చించాలని సభ్యులు పట్టుపట్టారు. దాంతో స్పీకర్ సభను పూర్తిగా వాయిదా వేశారు. శని,ఆదివారాలు సెలవు కావడంతో సభ తిరిగి సోమవారం సమావేశమవుతుంది.
……………………
…………………………
నినాదాలు, నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంటు
RELATED ARTICLES